వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. తాజాగా ఏడో జాబితాను వైఎస్సార్‌సీపీ విడుదల చేసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు ఇద్దరి పేర్లతో ఈ జాబితాను విడుదల చేసింది. పర్చూరు నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్న ఆమంచి కృష్ణమోహన్‌ను తప్పించి ఆ బాధ్యతలను యడం బాలాజీకి అప్పగించారు. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డిని తొలగించి.. కటారి అరవిందా యాదవ్‌ను సమన్వయకర్తగా పార్టీ అధిష్ఠానం నియమించింది.
కందుకూరు బాధ్యతల్ని తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన పెంచలయ్య కుమార్తె అరవింద యాదవ్‌కు అప్పగించారు. కందుకూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డిని కాదని తిరుపతి జిల్లా గూడూరు నుంచి ఇటీవలే పార్టీలో చేరిన పెంచలయ్య కుమార్తెకు టికెట్ ఇవ్వడం గమనార్హం. పర్చూరు బాధ్యతలను ఆమంచి నుంచి తప్పించి చీరాలకు చెందిన యడం బాలాజీని ఇంఛార్జ్‌గా నియమించారు. యడం బాలాజీ 2014లో చీరాల వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2019లో టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన టీడీపీలో చేరారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఆయన్ను సీఎం జగన్ పిలిపించుకుని మరీ వైఎస్సార్‌సీపీలోకి చేర్చుకుని పర్చూరు టికెట్ ఇచ్చారు.
ఈ రెండు నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు ఆసక్తికరంగా మారాయి. పర్చూరు ఇంఛార్జ్ బాధ్యతల నుంచి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను తప్పించడం ఆసక్తికరంగా మారింది. ఆమంచికి ఏ సీటు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కృష్ణమోహన్ పర్చూరులో పోటీచేయడానికి ఆసక్తిగా లేరు.. ఇప్పటికే అధిష్టానం పెద్దల్ని కలిసి చెప్పారు. తనకు చీరాల నుంచి అవకాశం ఇవ్వాలని పదే, పదే కోరారు. ఈ సమయంలో పర్చూరు నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది. ఆయనకు ఎక్కడ అవకాశం ఇస్తారనే చర్చ జరుగుతోంది. ఒకవేళ చీరాల నుంచి పోటీ చేయాలంటే అక్కడ కూడా పోటీ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరాం రేసులో ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో తనకు బదులుగా, తన కుమారుడు వెంకటేష్‌కు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో గతంలోనే వెంకటేషన్‌ను చీరాల వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌గా నియమించారు. అయితే చీరాల వ్యవహారంపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన మాత్రం రాలేదు.
మరోవైపు కందుకూరులో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డిని తప్పించారు. ఇటీవలే పార్టీలోకి వచ్చిన వారికి టికెట్ ఇచ్చారు. మరి మహీధర్ రెడ్డి పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది.. ఆయన్ను ఒప్పించే ఈ నిర్ణయం తీసుకున్నారా లేదా అన్నది క్లారిటీ లేదు. అంతేకాదు మహీధర్ రెడ్డితో కలిసే తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన పెంచలయ్య వైఎస్సార్‌సీపీలో చేరారు.. ఆయన కుమార్తెకు ఇప్పుడు కందుకూరు టికెట్ ఇచ్చారు. మొత్తం మీద ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో మార్పులు ఆసక్తికరంగా మారాయి.