అనంతపురం జిల్లా రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ పంచుల వర్షం కురిపించారు. భారీగా తరలివచ్చిన అశేష ప్రజానీకాన్ని తన స్పీచ్‌తో ఉర్రూతలూగించారు. ఐదేళ్ల క్రితమే ఏపీ జనం చొక్కా మడతేసి టీడీపికి 23 సీట్లు ఇచ్చారన్న జగన్.. మరోసారి చొక్కా మడతపెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. దేవుడు ఒక్కసారి ఆశీర్వదిస్తేనే ఇంత మంచి చేశామన్న జగన్.. ఇక రెండు, మూడోసారి గెలిపిస్తే ఇంకెంత మంచి చేస్తామో ఆలోచించాలన్నారు. 75 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పదవుల్లో ప్రాధాన్యతనిచ్చామనీ.. 57 నెలల కాలంలోనే 2 లక్షల 13 వేల ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే మళ్లీ వైసీపీనే రావాలని జగన్ అన్నారు.
ఈ క్రమంలోనే టీడీపీ, జనసేనపై సీఎం జగన్ సెటైర్లు వేశారు.సైకిల్ ఎప్పుడూ బయట, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్‌లోనే ఉండాలన్న జగన్.. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలంటూ విపక్షాలపై సెటైర్లు వేశారు. ఇదే సమయంలో చంద్రబాబు సూపర్ సిక్స్ మీద విమర్శలు చేశారు. ఎగ్గొట్టేవాడు 10 రూపాయల వడ్డీ అయినా ఇస్తానని అంటాడన్న జగన్.. మానిఫెస్టో మాయం చేసి హామీలు ఎగ్గొట్టే బాబు కేజీ బంగారం ఇస్తాను అంటారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసేవన్నీ మోసాలే, చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో రైతులకు గుర్తుకువచ్చే పథకం ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు. అందుకే చొక్కా మడతేసి, కుర్చీ మడతపెట్టి.. చీపుర్లతో టీడీపీని ఊడ్చేయాలని పిలుపునిచ్చారు.
ప్రసంగం ప్రారంభంలో ఉవ్వెత్తున తరలివచ్చిన జన సందోహాన్ని ఉద్దేశించి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జల సముద్రం వస్తే.. సిద్ధం సభతో రాయలసీమకు జనసముద్రం వచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో యుద్దం జరగబోతోందన్న జగన్.. ఈ యుద్ధం, మాట ఇచ్చి నిలబెట్టుకున్న వైసీపీకి.. మాటతప్పటమే అలవాటుగా ఉన్న పెత్తందార్లకు మధ్యన జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించారు. ఇదే సమయంలో తన పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక్క పథకాన్ని అయినా చెప్పాలంటూ చంద్రబాబుకు సవాల్ చేశారు. తాము ఇచ్చిన మాట నెరవేర్చామని.. అందుకే వైనాట్ 175 అంటూ ఎన్నికలకు వెళ్తున్నామన్నారు.
ఇక పొత్తుల గురించి కూడా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు." వైఎస్సార్‌సీపీ మీ అందరి పార్టీ. మాకు ఏ పార్టీతోనూ పొత్తు లేదు. ప్రజలతోనే మా పొత్తు. జగన్ మార్క్ ప్రతీ సామాజిక వర్గంలోనూ కనిపిస్తున్నప్పుడు చంద్రబాబుకు ఎందుకు ఓటు వేయాలని నేను అడుగుతున్నా. ప్రజలకు మంచి చేయలేనప్పుడు ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతున్నా. సైకిల్ తొయ్యడానికి ప్యాకేజీ స్టార్ ఎందుకని అడుగుతున్నా. జగన్ ప్రతీ ఇంటికి మంచి చేశాడు, ప్రతీ సామాజిక వర్గానికి మంచి చేశాడు, ప్రతీ పేదవాడు గుండెల్లో పెట్టుకున్నాడు.. అందుకే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తన నడక కోసం అటో కర్ర.. ఇటో కర్ర ఎందుకు.. జగన్‌కు జనబలం లేకుంటే చంద్రబాబుకు పొత్తులెందుకు?" అంటూ జగన్ ప్రశ్నించారు.