పాకిస్థాన్‌లో పరిస్థితి మారడం లేదు. ఇప్పటికే ఆర్థిక, రాజకీయ సంక్షోభంతోపాటు ఉగ్రదాడులు, వరుస హత్యలతో సతమతం అవుతున్న పాక్‌లో ఎన్నికలు జరిగి ప్రభుత్వం ఏర్పడితే పరిస్థితి మెరుగవుతుందని భావించిన వారి ఆశలు గల్లంతయ్యాయి. ఎన్నికలతో సమస్యలు తీరుతాయి అనుకుంటే.. మరిన్ని కొత్త సమస్యలు రావడం ప్రస్తుతం పాక్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే పాక్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని అంగీకరిస్తూ తాజాగా సీనియర్ ఎన్నికల అధికారి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే పాక్ ఎన్నికల కమిషన్ ఒక హై లెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ ఎన్నికల అక్రమాల వెనుక సీఈసీ, సీజే హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 13 మంది అభ్యర్థులు ఓడిపోయినా.. వారిని విజేతలుగా ప్రకటించినట్లు రాజీనామా చేసిన అధికారి చెప్పడం మరిన్ని విమర్శలకు తావిస్తోంది. దీంతో పాక్ ఎన్నికల భవితవ్యం ఏంటి అనేది ప్రస్తుతం సంచలనంగా మారింది.
పాక్ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చిన వేళ.. అక్కడి సోషల్ మీడియాపై ఆంక్షలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్‌లో ఎక్స్ సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇక పాకిస్థాన్ ఎన్నికల్లో అక్రమాల వ్యవహారంలో ఏకంగా పాక్ ఎన్నికల సంఘం, చీఫ్ జస్టిస్ ప్రమేయం ఉందని ఆరోపణలు వెల్లువెత్తడం మరింత చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఆరోపణలను పాక్ ఎన్నికల కమిషన్ ఖండించింది. ఈ రిగ్గింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ఓ హై లెవల్ కమిటీని నియమించింది. ఈ అంశంపై చర్చించేందుకు జరిగిన సమావేశంలో సీఈసీ సికందర్ సుల్తాన్ రజా పాల్గొన్నారు.
ఎన్నికల అక్రమాలపై దర్యాప్తులో భాగంగా ఏర్పాటైన హై లెవల్ కమిటీ ఆయా జిల్లాల్లోని ఎన్నికల అధికారుల నుంచి వాంగ్మూలాలు నమోదు చేసి.. వాటి ఆధారంగా 3 రోజుల్లో నివేదికను ఎన్నికల కమిషన్‌కు అందించనుంది. ఇక ఈ ఎన్నికల అక్రమాల ఆరోపణలను రావల్పిండి ఎన్నికల కమిషనర్ సయీఫ్ అన్వర్ జప్పా పూర్తిగా ఖండించారు. ఎన్నికల్లో తమ పాత్ర కేవలం అందర్నీ సమన్వయం చేయడం వరకే ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా పాక్ సైనిక నాయకత్వం ఉండే రావల్పిండిలో దాదాపు 13 మంది అభ్యర్థులను ఓడిపోయినా.. బలవంతంగా విజేతలుగా ప్రకటించామని రావల్పిండి మాజీ కమిషనర్ లియాఖత్ అలి ఛత్తా ఆరోపించడం పెను సంచలనం సృష్టించింది. మరోవైపు.. పాక్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే వార్తలు గుప్పుమంటున్న వేళ.. అక్కడ సోషల్ మీడియా సరిగా పనిచేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎక్స్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడిందని నెట్‌బ్లాక్స్ అనే సంస్థ తెలిపింది. పాక్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని.. దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న వేళ.. సోషల్ మీడియాపై ఆంక్షలు విధించారనే వాదనలు వినిపిస్తున్నాయి.
గత వారం జరిగిన పాకిస్థాన్ ఎన్నికల్లో అత్యధికంగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పీటీఐ మద్దతు గల అభ్యర్థులు 93 మంది విజయం సాధించారు. అయితే మేజిక్ ఫిగర్ రాకపోవడంతో.. బిలావల్ భుట్టో నేతృత్వంలోని పీపీపీ.. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ పార్టీలు.. మరికొన్ని చిన్నా చితకా పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. మొదట నవాజ్ షరీఫ్ ప్రధానిగా బాధ్యతలు చేపడతారని వార్తలు వచ్చినప్పటికీ.. సైన్యం జోక్యంతో ఆయన సోదరుడు షెహబాజ్ షరీఫ్ పీఎం పదవి చేపట్టేందుకు సిద్ధమ్యయారు. అయితే తమకే పూర్తి మెజార్టీ వచ్చినా.. ఫలితాలను ఆలస్యంకా ప్రకటించి ఫలితాలను తారుమారు చేశారని పీటీఐ నేతలు ఆరోపించారు.