మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే ప్రజల ఇళ్లు, పొలాలను కూడా వైసీపీ నేతలు కబ్జా చేస్తారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ హెచ్చరించారు. విశాఖలో వారి భూ కబ్జాలకు సహకరించలేదనే ఎమ్మార్వో రమణయ్యను కిరాతకంగా హత్య చేశారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో అనేక పర్యాయాలు ప్రభంజనం సృష్టించిన ‘సైకిల్’.. సామాన్యుడి చైతన్య రథమని, అది అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ ప్రజల మఽధ్యే ఉంటుందని అన్నారు. శంఖారావం’ కార్యక్రమంలో భాగంగా ఆయన సోమవారం విశాఖ ఉత్తరం, గాజువాక, అనకాపల్లి, చోడవరం సభల్లో ప్రసంగించారు. ‘సైకిల్, గ్లాస్ విలువ పెత్తందారుకు అర్థం కాదన్నారు. సామాన్యులు ప్రతి ఒక్కరూ గ్లాస్‌లోనే టీ తాగి తర్వాత శుభ్రం చేసుకుని మరోసారి వినియోగిస్తారని.. బహుశా జగన్ బంగారు/వెండి గ్లాస్‌లో టీ తాగుతారేమోనని ఎద్దేవాచేశారు. ‘ఫ్యాన్ రెక్కలు ఎప్పుడో విరిగిపోయాయి. దానిని చెత్తబుట్టలో పడేయడం ఒక్కటే మిగిలింది. అధికారంలోకి వస్తే లక్షల ఉద్యోగాలు, మెగా డీఎస్సీ, గ్రూప్-1,2 నోటిఫికేషన్లు, ఏటా 6,500 కానిస్టేబుళ్ల పోస్టులు భర్తీ చేస్తామని 2019లో జగన్ ఇచ్చిన హామీని నమ్మి వేలాది మంది యువతీయువకులు రూ.లక్షలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకున్నారు. చివరకు నోటిఫికేషన్లు లేకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకు ఫ్యాన్ ఉపయోగపడుతోంది. ఉచిత ఇసుక విధానం రద్దుతో పనుల్లేక భవన నిర్మాణ కార్మికులు.. ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికులు.. బిల్లులు రాక చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఫ్యాన్లకు ఉరేసుకుని చనిపోతున్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో పలు వర్గాలకు చెందిన సుమారు 35 వేల మంది వరకు ఫ్యాన్లకు ఉరేసుకుని చనిపోయారు. జగన్ పదేపదే ‘సిద్ధమా’ అని అంటున్నారు. ఆదివారం రాప్తాడు సభకు వెళ్లిన జగన్‌కు అక్కడ నాయకులు, కార్యకర్తలు తామంతా సిద్ధంగా లేమని చెప్పారన్నారు.