చంద్రబాబు ఎల్లో మీడియాతో కలిసి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. గోబెల్స్ ప్రచారం చేసి చర్చకు రమ్మంటే రావాలా? అని ఫైర్ అయ్యారు. అంతిమంగా నిర్ణయించేది ప్రజలేనని అన్నారు. మీడియాలో ఊసుపోని కబుర్లతో చంద్రబాబు కాలక్షేపం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు పగటి కలలు కంటున్నారని మండిపడ్డారు. తాము మంచి చేశామని నమ్మితే ఓటు వేయమని ప్రజలను అడుగుతున్నామని తెలిపారు. చంద్రబాబు సభలు ఎందుకో ఎవరికీ తెలీదని సజ్జల ఎద్దేవా చేశారు. సిద్ధం సభలకు జనస్పందన చూస్తే సీఎం వైయస్ జగన్‌పై ఉన్న ప్రజాదారణ అర్థమవుతుందని తెలిపారు. ఏం చూసి చంద్రబాబుకు ఓటు వేయాలి? అని ప్రశ్నించారు. మరో 50 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయని తెలిపారు. రూ.2.55 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయింది వాస్తవం కాదా? అని నిలదీశారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు వాస్తవం కాదా? అని అన్నారు. చంద్రబాబు సవాల్‌కు తాము సిద్ధమేనని అన్నారు.