వెంటిలేటర్ తీసేస్తే 10 నిమిషాల్లోనే చనిపోతారని.. బంధువులకు కబురు పంపమని చెప్పారు ఆస్పత్రి డాక్టర్లు చెప్పారు. మలేషియాలో ఉన్న వరుసకు కొడుకు (సోదరి కుమారుడు)ని కూడా ఆగమేఘాలపై ఊరికి రప్పంచారు. అంత్యక్రియలకు అన్నీ సిద్ధం చేశారు. తీరా వెంటిలేటర్‌ను తీసేసి ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆమె మళ్లీ లేచి కూర్చొంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ విచిత్రమైన ఘటన జరిగింది.
అమలాపురం రూరల్ మండలం జనుపల్లి మన్నా కాలనీకి చెందిన లంకలపల్లి శ్రీరామమూర్తి, సత్యవేణి దంపతులు నివాసం ఉంటున్నారు. సత్యవేణి కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నెల 17న బీపీ రావడంతో కింద పడిపోయారు.. వెంటనే ఆమెను అమలాపురంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించాడు. 18వ తేదీ ఉదయానికి ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.. వెంటిలేటర్ తీసేస్తే చనిపోతుందని డాక్టర్లు చెప్పేశారు.
ఆ వెంటనే బంధువులు మలేషియాలో ఉంటున్న కొడుకు వరసయ్యే (సోదరి కుమారుడు)ను హుటాహుటిన పిలిపించారు. అదే రోజున అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసి సత్యవేణిని ఆస్పత్రి నుంచి అంబులెన్సులో ఇంటికి తీసుకువచ్చారు. ఇంతలో ట్విస్ట్ ఇస్తూ కొద్దిసేపటికే ఆమె లేచి కూర్చుని మీరంతా ఎందుకొచ్చారని ప్రశ్నించడంతో అందరూ అవాక్కయ్యారు. ఆమెకు మంగళవారం ఉదయం మళ్లీ బీపీ డౌన్ కావడంతో ఆమెను మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అంత్యక్రియలకు అంతా సిద్ధం చేసిన తర్వాత ఓ మహిళ లేచి కూర్చోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.