ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలోని 210 హైస్కూళ్లను కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 207 కో ఎడ్యుకేషన్ స్కూళ్లతో పాటుగా, బాలికల కోసం ఉద్దేశించిన మూడు హైస్కూళ్లను కూడా జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ప్రతి మండలంలో జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. అందుకు అనుగుణంగా బాలికలకు ఒకటి, మరొక కో ఎడ్యుకేషన్ కాలేజీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే రెండు కాలేజీలు లేని మండలాలల్లో హైస్కూళ్లనే జూనియర్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేయాలని అధికారులు నిర్ణయించారు.
అందులో భాగంగానే 210 హైస్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేశారు. అయితే 2024- 24 విద్యా సంవత్సరం నుంచి వీటిలో ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. వీటిలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులలో విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు, అయితే ఒక్కో తరగతిలో కేవలం 40 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే 292 హైస్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేశారు. తాజాగా మరో 210 హైస్కూళ్లను అప్ గ్రేడ్ చేశారు. జూనియర్ కాలేజీలు లేని మండలం ఉండకూడదనే ఉద్దే్శంతోనే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది.
మరోవైపు ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం ప్రకారం వచ్చే విద్యా సంవత్సరంలో ప్రైవేట్, అన్ ఎయిడెడ్ స్కూళ్లల్లో ఉచిత ప్రవేశాలకు సంబంధించి కూడా ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ క్యాటగిరీల్లోని పేద విద్యా్ర్థులతో పాటు అనాథ, హెచ్ఐవీ బాధితులు, దివ్యాంగులకు దీని ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. అర్హులైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 1న మొదటి విడత ఫలితాలు, ఏప్రిల్ 15న రెండో విడత ఫలితాలు ప్రకటించనున్నారు.