మహిళల పట్ల రోజురోజుకూ అకృత్యాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఎన్ని చట్టాలు చేసినా ఈ దుర్మార్గుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా గుంటూరు జిల్లాలో ఇలాంటి వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో ఓ బాలికను వాలంటీర్ వేధించాడు. అయితే రోజురోజుకూ వేధింపులు పెరిగిపోవటంతో బాధితురాలు ఎవరికీ చెప్పుకోలేకపోయింది. చివరకు ఆత్మహత్యకు యత్నించగా.. అసలు విషయం బయటపడింది. అయితే ఆ వాలంటీర్ గతంలో బాధితురాలి అక్కను సైతం వేధించినట్లు తెలిసింది.
గుంటూరు జిల్లాలో ఓ వాలంటీర్ బాగోతం తాజాగా వెలుగుచూసింది. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన శ్రీకాంత్ వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. ఇక అదే గ్రామంలో పదో తరగతి చదువుతున్న ఓ అమ్మాయిని ప్రేమ పేరుతో వేధించాడు శ్రీకాంత్. పదో తరగతిలో మెరిట్ స్టూడెంట్ అయిన ఆ బ బాలికకు.. ట్రిపుల్ ఐటీలో కూడా సీటు వచ్చింది. అయితే కాలేజీకి వచ్చిన తర్వాత కూడా శ్రీకాంత్ వేధింపులు ఆగలేదు. తనను ప్రేమించాలంటూ వెంట పడటం ఆపలేదు. దీంతో తన బాధను ఇంట్లో చెప్పుకుంది ఆ అమ్మాయి. దీంతో మెరిట్ స్టూడెంట్ అయినప్పటికీ శ్రీకాంత్ వేధింపులు తట్టుకోలేక అమ్మాయి తల్లిదండ్రులు చదువు మాన్పించారు. ఇంట్లో తమ వద్దే ఉంచుకుని పొలంలో పనులకు తీసుకెళ్తున్నారు.
అయితే శ్రీకాంత్ వేధింపులు అక్కడితో ఆగిపోలేదు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ అమ్మాయి చెల్లెల్ని వేధించడం మొదలెట్టాడు. మీ అక్కతో మాట్లాడాలంటూనే చెల్లెలను సైతం వేధించసాగాడు. భరించినన్ని రోజులు భరించిన ఆ బాలిక శ్రీకాంత్ వేధింపులు తట్టుకోలేకపోయింది. శ్రీకాంత్ వేధింపులతో ఇప్పటికే అక్క చదువును ఆపివేయించారు. ఇంట్లో చెబితే తన చదువు కూడా మాన్పిస్తారనే భయపడిపోయింది. అయితే రోజురోజుకూ శ్రీకాంత్ వేధింపులు శ్రుతిమించడంతో ఇంట్లో విషయం చెప్పింది. అయితే అక్కాచెళ్లెళ్లను ఇద్దరిని వాలంటీర్ శ్రీకాంత్ వేధిస్తుండటంతో ఆ కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. బాలికను మందలించారు.
ఈ క్రమంలో మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అయితే వాంతులు అవుతుండటంతో కుటుంబసభ్యులు గట్టిగా నిలదీశారు. దీంతో అసలు విషయం చెప్పగా.. నర్సరావుపేటలోని ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ప్రేమపేరుతో అక్కాచెళ్లెళ్లను వేధించిన వాలంటీర్ శ్రీకాంత్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.