తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన బంగారు, వజ్రాభరణాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు బెంగళూరు కోర్టు తేదీని నిర్ణయించిన విషయం తెలిసిందే. మార్చి 6,7 తేదీల్లో ఆ ఆభరణాలను తీసుకోవడానికి 6 ట్రంకు పెట్టెలతో రావాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, ఆ నగలు ఆమె వారసురాలైన దీపకా? లేదా ప్రభుత్వమే వాటిని స్వీకరిస్తుందా? అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జయలలితకు చెందిన 7 కిలోల సంప్రదాయ కుటుంబ ఆభరణాలు ఆమె మేనకోడలు దీపకు అప్పగించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
జయలలితపై 1996లో ఆదాయనికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. చెన్నై పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు నిర్వహించిన సోదాల్లో మొత్తం 468 రకాల 27 కిలోల బంగారు, వజ్రాల నగలు, 700 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. జయ అక్రమాస్తుల కేసు విచారణను పక్క రాష్ట్రానికి బదిలీ చేయడంతో స్వాధీనం చేసుకున్న ఆభరణాలు, విలువైన వస్తువులను కర్ణాటక ట్రెజరీలో భద్రపరించారు. ఈ కేసులో ప్రత్యేక న్యాయమూర్తి జాన్ మేకేల్ డిగున్హా 2014లో తీర్పు వెలువరించారు.
దివంగత జయలలితతో పాటు ఆమె స్నేహితురాలు శశికళ, ఇళవరసి, సుధాకర్‌లను దోషులుగా నిర్దారించి, వారందరికీ నాలుగేళ్లు జైలు శిక్ష ఖరారు చేశారు. జయలలితకు రూ.100 కోట్లు, మిగతా ముగ్గురికీ తలా రూ.10 కోట్ల జరిమానా విధించారు. ఈ తీర్పును కర్ణాటక హైకోర్టులో సవాల్ చేయడంతో అక్కడ వారికి అనుకూలంగా నిర్ణయం వచ్చింది. దీంతో కేసు సుప్రీంకోర్టుకు చేరగా.. 2017 ఫిబ్రవరి 14న బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థించింది. అయితే, ఈ తీర్పు రావడానికి కొద్ది నెలల ముందే జయలలిత మృతి చెందడం వల్ల ఆమెపై వచ్చిన అభియోగాలు రద్దవుతాయని కోర్టు తెలిపింది.
శశికళ, సుధాకర్, ఇళవరిసిలకు మాత్రం జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. జయకు విధించిన రూ.100 కోట్ల జరిమానా విషయంలో ఆమె ఆస్తులను వేలం వేసేందుకు చర్యలు చేపడతామని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది. ఈ క్రమంలో జయ ఆస్తులు వేలం ద్వారా లభించే ఆదాయం ప్రజా సంక్షేమ పథకాలకు ఉపయోగించాలని కోరుతూ బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానాన్ని నరసింహమూర్తి అనే సామాజిక కార్యకర్త ఆశ్రయించారు. అదే సమయంలో జయలలిత మేనకోడలు దీప సైతం తన మేనత్త వస్తువుల్లో హక్కు ఉందని, అప్పగించాలని పిటిషన్ వేశారు.
దీంతో జరిమానా వసూలు చేసేలా న్యాయశాఖ నగలు విక్రయించేందుకు నిర్ణయించింది. 27 కిలోల నగల్లో 20 కిలోలు విక్రయించి, మిగతా 7 కిలోలు సంప్రదాయ వారసత్వ ఆభరణాలు కాబట్టి వాటిని విక్రయించకూడదని న్యాయశాఖ నిర్ణయించనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సంపద్రాయ వారసత్వ నగలు జయలలిత మేనకోడలు దీపకు అప్పగించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.