ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుప్రీం సీనియర్‌ న్యాయవాది, న్యాయకోవిదుడు ఫాలీ నారీమన్‌ కన్నుమూత

national |  Suryaa Desk  | Published : Wed, Feb 21, 2024, 11:41 PM

ప్రఖ్యాత న్యాయకోవిదుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలి ఎస్ నారిమన్ బుధవారం ఉదయం కన్నుమూశారు. 95 ఏళ్ల నారిమన్ ఢిల్లీలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. న్యాయవాదిగా 70 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న నారిమన్.. పలు చరిత్రాత్మక కేసుల్లో వాదనలు వినిపించారు. 1929 జనవరి 10న బర్మా (ప్రస్తుతం మయన్మార్)లోని యంగూన్‌లో జన్మించారు. కేవలం 21 ఏళ్లకే 1950లో బాంబే హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించి, 1961లో సీనియర్ అడ్వకేట్‌గా ఎంపికయ్యారు. అనంతరం 1972లో సుప్రీం కోర్టులో లాయర్‌గా తన ప్రస్థానం ప్రారంభించారు.


తర్వాత భారత అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. అయితే, నాటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ 1975 జూన్‌లో పదవికి రాజీనామా చేశారు. పౌర హక్కులు, లౌకికవాదం విషయంలో ప్రజల పక్షాన నారిమన్ బలమైన గొంతుకగా నిలబడ్డారు. న్యాయపరమైన పరిణామాల గురించి ఆయన విమర్శనాత్మక అభిప్రాయాలు చాలా ముఖ్యమైనవి. ఇటీవల ఆర్టికల్ 370 కేసులో తీర్పుపై నారిమన్ విమర్శలు గుప్పించారు. నారిమన్ కుమారుడు రోహిటన్ నారిమన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.


నారీమన్ ఆత్మకథ ‘బిఫోర్ మెమరీ ఫేడ్స్’ ముఖ్యంగా న్యాయ విద్యార్థులు, యువ న్యాయవాదులలో ప్రేరణగా పనిచేస్తుంది. ‘ది స్టేట్ ఆఫ్ నేషన్’, ‘గాడ్ సేవ్ ది హానబుల్ సుప్రీం కోర్ట్’ అనేవి ఇతర పుస్తకాలలో కొన్ని. ‘నేను లౌకిక భారతదేశంలో పెరిగాను.. దేవుడు అనుగ్రహిస్తే అదే లౌకిక దేశంలో చనిపోవాలని కోరుకుంటున్నాను’ అని తన ఆత్మకథలో రాశారంటే ఆయన ఎంతటి లౌకికవాది అనేది అర్ధమవుతుంది. ఈ పుస్తకంలోనే భోపాల్ యూనియన్ కార్పైడ్ పరిశ్రమలో దుర్ఘటన గురించి ప్రస్తావించారు. ఈ కేసులో పరిశ్రమ తరఫున నారీమన్ వాదనలు వినిపించారు.


న్యాయరంగంలో నారిమన్ తన విశేష సేవలకు గుర్తుగా 1991లో పద్మభూషణ్, 2007లో పద్మవిభూషణ్ పురస్కరాలను అందుకున్నారు. 1991 నుంచి 2010 వరకు ఇండియన్ బార్ కౌన్సిల్ అధ్యక్షుడిగా సేవలందించారు. అలాగే, అంతర్జాతీయ స్థాయిలో పలు పదవులను చేపట్టారు. 1989 నుంచి 2005 వరకు ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ వైస్-ఛైర్మెన్‌గా ఉన్నారు. 1995 నుంచి 1997 వరకు జెనీవాలోని ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జ్యూరిస్ట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఛైర్మన్‌గా కూడా పనిచేశారు.


నారీమన్ మృతి పట్ల సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ సంతాపం వ్యక్తం చేశారు. ‘ఓ శకం ముగిసింది’ అని భావోద్వేగానికి గురయ్యారు. నారిమన్‌ను గుర్తు చేసుకుంటూ ‘మానవ తప్పిదాలకు గుర్రాల వ్యాపారం అనే పదాన్ని ఉపయోగించడం గుర్రాలను అవమానించడమేనని నారిమన్ అన్నారు’ అని పేర్కొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com