అమెరికా మహిళను మోసం చేసి 1.50 లక్షల డాలర్లు (రూ.1.24 కోట్లు) దోచేసిన భారతీయ యువకుడికి అమెరికా కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. కంప్యూటర్ హ్యాకింగ్ పథకం ద్వారా మోసానికి పాల్పడిన 24 ఏళ్ల భారతీయ యువకుడ్ని దోషిగా నిర్దారించిన కోర్టు.. 51 నెలల జైలు శిక్ష విధించిందని అమెరికా న్యాయవాది తెలిపారు. హరియాణాకు చెందిన సుఖ్‌దేవ్ వైద్.. డిసెంబర్ 2023లో తన నేరాన్ని అంగీకరించాడని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా వృద్ధ అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడినట్టు నిర్దారణ అయ్యింది. మొత్తం 1.2 మిలియన్ డాలర్లకు పైగా నగదు కాజేసినట్టు ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.
వైద్ బహిష్కరణ కోసం బ్యూరో ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు సరెండ్ చేయాలని, కొట్టేసిన 1.24 మిలియన్ డాలర్లకుపైగా మొత్తాన్ని చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ‘మన దేశం వెలుపల ఉన్న వ్యక్తులు అమెరికన్లను బలిపశువులను చేయడం సర్వసాధారణమైపోయింది. ప్రత్యేకించి ఇది వైర్ ఫ్రాడ్‌కు సంబంధించింది.. ఇదే మొదటిసారి కాదు.. నిందితుడ్ని పట్టుకోవడంలో ఎఫ్‌బీఐ అధికారులు పనితీరు అమోఘం.. ఇటువంటి నేరస్థుల విషయంలో కనికరం లేకుండా ముందుకెళ్తాం.. మా ప్రయత్నాల వల్ల ఈ మోసగాళ్లు వైద్‌లా పట్టుబడతారని విశ్వసిస్తున్నాం’ అని అమెరికా అటార్నీ లాస్లోవిచ్ అన్నారు.
‘ఫాంటమ్ హ్యాకర్’ పేరుతో ఎక్కువగా సీనియర్‌లను లక్ష్యంగా చేసుకున్నాడని తెలిపారు. ఇటువంటి మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత నెంబర్లు నుంచి వచ్చే టెక్స్ట్ మెసేజ్‌లు, పాప్-అప్‌లు, మెయిల్స్ ఎప్పుడూ క్లిక్ చేయవద్దని, జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ప్రతిక్షణం పోలీసులు, అధికారులు ఇటువంటి మోసగాళ్ల విషయంలో కాపలాగా ఉండరని, అవగాహనతో ఉండాలని ఆయన కోరారు. మానసికంగా తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయాయని, ఎవర్ని విశ్వసించాలో నాకు తెలియడం లేదని వైద్ చేతిలో మోసపోయిన మోంటానా బాధితురాలు కోర్టులో వాపోయింది.
వృద్ధ అమెరికన్ల దోపిడీ వెనుక భారత్‌లోని పెద్ద సంస్థ ప్రమేయం ఉందని కోర్టుకు సమర్పించిన పత్రాలలో ప్రభుత్వం ఆరోపించింది. గతేడాది ఫిబ్రవరిలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కాలిస్‌పెల్‌కు చెందిన జేన్ డో అనే 73 ఏళ్ల మహిళ తాను మోసపోయినట్టు ఎఫ్‌బీఐకి ఫిర్యాదు చేసింది. హ్యాకింగ్ ద్వారా తన వ్యక్తిగత ఖాతాలోని మొత్తాన్ని దోచేశారని ఆరోపించింది. దీంతో కేసు నమోదుచేసిన ఎఫ్‌బీఐ.. వైద్‌తో పాటు ఎడ్లీ జోసెఫ్ అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో జోసెఫ్‌కు కోర్టు ఇంతకు ముందే 33 నెలల జైలు శిక్ష విధించింది.