ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి ఉదయం 11 వరకు డెడ్‌లైన్.. తర్వాత ఏం జరిగినా కేంద్రానిదే బాధ్యత: రైతులు హెచ్చరిక

national |  Suryaa Desk  | Published : Wed, Feb 21, 2024, 11:45 PM

కనీస మద్దతు ధరకు చట్టబద్దత విషయంలో కేంద్రం చేసిన ప్రతిపాదనలను తిరస్కరించిన రైతులు.. బుధవారం తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సహా తమ 20 డిమాండ్ల పరిష్కారించాలని కోరుతూ ఢిల్లీ ఛలో నిరసన చేపట్టిన అన్నదాతలు.. తాజాగా, కేంద్రానికి డెడ్‌లైన్‌ విధించారు. బుధవారం ఉదయం 11 గంటలకల్లా ప్రభుత్వం స్పందించాలని, లేకపోతే ఢిల్లీ ఛలో యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా పూర్తిగా కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. గడువు ముగిసిన తర్వాత రాజధాని వైపు తమ ప్రయాణం కొనసాగిస్తామని రైతు సంఘాల నాయకులు వెల్లడించారు.


రైతు సంఘం నేత శర్వాన్‌ సింగ్‌ పంథేర్‌ శంభువద్ద మీడియాతో మాట్లాడుతూ.. ఒక రోజు ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరపై చట్టాన్ని ఆమోదించాలని డిమాండు చేశారు. రుణ మాఫీతోపాటు తమ ఇతర డిమాండ్లనూ ఆమోదించాలని ఆయన కోరారు.‘మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీలో అడుగుపెట్టనివ్వకూడదన్నది కేంద్రం ఉద్దేశం.. చర్చల ద్వారా డిమాండ్లు పరిష్కారం కావాలనుకుంటే ఢిల్లీవైపు రైతులు వెళ్లేందుకు అనుమతించాలి.. ప్రస్తుతం హరియాణా వద్ద పరిస్థితి కశ్మీర్‌లా తయారైంది.. మా అసలు డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గేలా కేంద్రం ప్రతిపాదనలు చేసింది.. ఇప్పుడు ఏం జరిగినా దానికి కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని పంథేర్‌ హెచ్చరించారు. రైతుల అంశంపై తమ వైఖరిని స్పష్టం చేయాలని అన్ని ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు.


మరోవైపు, రైతుల మళ్లీ ఆందోళనకు సిద్ధమైన నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సింగూ సరిహద్దులతో పాటు మిగతా అన్ని జిల్లాల సరిహద్దుల్లో సుమారు ఐదు వేల మంది పోలీసులు, పారామిలటరీ బలగాలను మోహరించారు. అంబాలా, కురుక్షేత్ర, సోనిపట్‌, ఢిల్లీలోని సింగు సరిహద్దులో 40 లేయర్ బారికేడ్‌లను ఏర్పాటుచేశారు. అయితే, వీటిని బద్దలు కొట్టడానికి రైతులు శంభు సరిహద్దు వద్ద పోక్‌లేన్, హైడ్రా, JCBలను సిద్దం చేసుకున్నారు. టియర్ గ్యాస్ క్యానన్లు, రబ్బరు బుల్లెట్ల నుంచి రక్షణ కోసం ట్రాక్టర్ క్యాబిన్లకు ఐరన్ గ్రిల్స్, షీట్‌లను అమర్చుకున్నారు.


టియర్ గ్యాస్ షెల్స్ నుంచి వెలువడే పొగ ప్రభావం పడకుండా ఉండేందుకు రైతులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక అడుగు ముందుకు వేసి భారీ సంఖ్యలో తడి గోనె సంచులను ఉంచుకున్నారు. అంబాలాలోని ఘగ్గర్ నది వంతెన హైవేకి ఇరువైపులా అడ్డుకునేందుకు హరియాణా పోలీసులు మెటల్ షీట్లను ఏర్పాటు చేశారు. రైతులు నదిని దాటుతారని భావించిన పోలీసులు ట్రాక్టర్లు, ట్రాలీలు, ఇతర మోటారు వాహనాల రాకపోకలను ఆపడానికి నదీ తీరంలో తవ్వేశారు. అయితే, నది దాటేలా రైతులు తాత్కాలిక వంతెన నిర్మాణం కోసం తమ ట్రాలీల్లో మట్టి నింపిన బస్తాలను తీసుకెళ్తున్నారు. వీటిని నదిని దాటేందుకు ర్యాంప్‌గా ఉపయోగించాలని భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com