ఓ రాజకీయ నాయకుడు.. తన కుమారుడి వివాహం సందర్భంగా కేవలం రూపాయి మాత్రమే కట్నంగా తీసుకుని ఆదర్శంగా నిలిచారు. ఆయనే హరియాణా రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి కృష్ణ చౌకర్. సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తోన్న చౌకర్ కుమారుడు గౌరవ్‌కు హరియాణా రాష్ట్ర స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఛైర్మన్ భూపాల్ సింగ్ ఖాద్రీ కుమార్తె గరిమాతో వివాహం జరిపించారు. ఈ సందర్భంగా బంధువులు అందరి ముందు వరుడికి భూపాల్ సింగ్ రూ.7.50 లక్షలు కట్నంగా ఇచ్చారు. అయితే, ఆ మొత్తాన్ని సున్నితంగా నిరాకరించారు వరుడి తండ్రి కృష్ణ చౌకర్. సంచిలో నుంచి రూపాయి మాత్రమే తీసుకుని, మిగిలింది వెనక్కి ఇచ్చేశారు. దీంతో అతిథులంతా ఆయనపై ప్రశంసలు కురిపించారు.
ఈ సందర్భంగా కృష్ణ చౌకర్ మాట్లాడుతూ.. వరకట్నం సమాజానికి శాపమని అన్నారు. ఇక, తన కుమార్తెకు కట్నంగా ఇచ్చిన సొమ్మును వరుడి కుటుంబం నిరాకరించడంతో వధువు తండ్రి ఆ మొత్తాన్ని ఓ మహిళా కాలేజీకి విరాళంగా అందజేయడం విశేషం. ఆయన చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. కట్నం నిరాకరించి వరుడి తండ్రి, ఆ సొమ్మును సమాజం కోసం అందజేసిన వధువు తండ్రి ఎందరికో ఆదర్శంగా నిలిచారని కొనియాడుతున్నారు. ఈ వివాహ వేడుకకు హాజరైన హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కృష్ణ చౌకర్, ఖాద్రీలను అభినందించారు. సమాజం దీనిని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.
దీనిపై ఖాద్రీ మాట్లాడుతూ.. అమ్మాయిల విషయంలో తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు రావాలని అన్నారు. కుటుంబానికి ఆడబిడ్డలు శాపం కాదని వరం అని పేర్కొన్నారు. ‘ఇంట్లో ఆడపిల్ల పుడితే అమ్మానాన్నలు, మేనమామలు పరువు పోతుందని కొన్నాళ్లుగా ఆలోచిస్తున్నారు... అయితే ఈ ఆధునిక సమాజంలో ప్రజలు తమ ఆలోచనలను మార్చుకోవాలి. కూతుళ్లు భారం కాదు వరం’ అని వ్యాఖ్యానించారు.