మూగజీవాలను ఎంతగానో ప్రేమించే కొందరు వాటిని తమ కుటుంబసభ్యుల కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు. తాజాగా, తన పెంపుడు శునకానికి లగ్జరీ హోటల్‌లో ఘనంగా పుట్టినరోజు వేడుకలను జరిపించారు. అంతేకాదు, అతిథులుగా 30కిపైగా శునకాలు హాజరుకాగా.. వాటికి రిటర్న్ గిఫ్ట్‌లుగా పెట్ ఫుడ్ అందజేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరానికి చెందిన ఆకాంక్ష రాయ్ అనే మహిళ ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటోన్న శునకానికి పుట్టినరోజు నిర్వహించి వార్తల్లో నిలిచారు. ఆకాంక్ష రాయ్ తన పెంపుడు శునకానికి ‘హ్యాండ్సమ్’ అనే పేరు పెట్టారు. మూడేళ్ల వయసున్న ఈ శునకం అంటే ఆకాంక్షతో పాటు కుటుంబసభ్యులకు వల్లమాలిన అభిమానం.
గోల్డెన్ రిట్రీవర్ బ్రీడ్‌కు చెందిన తన శునకం పుట్టినరోజు సందర్భంగా.. హోటల్‌లో పార్టీని ఏర్పాటుచేశారు. ఆ రోజు ఉదయాన్నే ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దానిని ఇండోర్‌లోని ప్రముఖ ఖజ్రానా గణేశ్ ఆలయానికి తీసుకెళ్లి పూజలు జరిపించారు. అనంతరం హ్యాండ్సమ్‌ను డాగ్ పార్లర్‌కు తీసుకెళ్లి ప్రత్యేకంగా అలంకరించారు. తర్వాత నగరంలోని లగ్జరీ హోటల్ డైనర్స్ పార్క్‌కు తీసుకువచ్చారు. హ్యాండ్సమ్‌తో ఆమె కేక్ కట్ చేయించారు. అతిథులుగా తమ శునకాలను తీసుకొచ్చిన యజమానులకు ప్రత్యేకమైన విందు ఇచ్చారు.
అంతేకాదు, గెస్ట్‌లుగా వచ్చిన శునకాలకు సైతం వివిధ ఆహార పదార్థాలతో విందును ఏర్పాటు చేశారు. అలాగే, వాటికి రిటర్న్ గిఫ్ట్ కింద పెట్ ఫుడ్ ప్యాకెట్లను అందజేయడం విశేషం. అతిథులు సైతం హ్యాండ్సమ్ కోసం పలు గిఫ్ట్‌లు తీసుకొచ్చారు. హ్యాండ్సమ్ పేరు మీద ప్రత్యేకంగా ఓ సోషల్ మీడియా ఖాతాను కూడా తెరిచారు. ఈ ఖాతాకు చాలామంది ఫాలోవర్స్ ఉండడం విశేషం.
దీనిపై ఆకాంక్ష రాయ్ మాట్లాడుతూ.. తనకు హ్యాండ్సమ్ ఓ బిడ్డ మాదిరి అని చెప్పారు. తాను ఎక్కడికి వెళ్లినా వెంట తీసుకెళ్తానని అన్నారు. దాని పుట్టినరోజు కూడా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఒక్క క్షణం కూడా మేము లేకపోతే విలవిలలాడిపోతుందని చెప్పారు.