నాలుగేళ్లుగా పట్టిపీడిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి.. ఇప్పుడిప్పుడే శాంతించింది. అయినా సరే కొత్త వేరియంట్ల రూపంలో ఏదో ఒకచోట దాడి చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచాన్ని మరో కొత్తరకం వైరస్ భయపెడుతోంది. ప్రస్తుతం జంతువులకు మాత్రమే పరిమితమైన ఈ వ్యాధి.. భవిష్యత్తులో మానవాళికి సోకడం మొదలైతే ఉపద్రవాన్ని ఆపడం కష్టమని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. అదే ‘జాంబీ డీర్’వైరస్. ప్రస్తుతం ఈ వైరస్ బారినపడి పెద్ద సంఖ్యలో జింకలు మృతిచెందుతున్నాయి. క్రానిక్ వేస్టింగ్ డిసీజ్‌గా పిలిచే జాంబీ డీర్ వైరస్.. నాడీవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం అమెరికాలో జింకలలో ఇది వేగంగా వ్యాపిస్తోంది.
జాంబీ వైరస్ వ్యాప్తి గురించి కెనడా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే కాలంలో మనుషులు కూడా ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ నివేదికల ప్రకారం.. బ్రిటిష్ కొలంబియా, కెనడాలో జాంబీ వైరస్ వ్యాప్తి నిరోధించడానికి మార్గదర్శకాలను జారీచేశారు. ఈ వ్యాధికి సంబంధించిన రెండు కేసులు జనవరి చివరిలో నమోదయ్యాయి. అప్పటి నుంచి కెనడా అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. రోడ్డుపై చనిపోయి ఉన్న ప్రతి జింక, దుప్పి, ఎల్క్ లేదా కారిబోల కళేబరాలను పరీక్షించాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.
జాంబీ డీర్ వైరస్.. మెదడు, ఇతర కణజాలాలలో పేరుకుపోయి శారీరక, మానసిక ప్రవర్తనా మార్పులు, క్షీణత, చివరికి మరణానికి కారణమవుతుంది. ఇది ఒక జంతువు నుంచి మరో జంతువుకు సంపర్కం లేదా పరోక్షంగా మలం, నేల, వృక్షాల వంటి పర్యావరణం ద్వారా వ్యాపిస్తుంది. జంతువుల మేత లేదా పచ్చిక బయళ్లను మోసుకెళ్లే ప్రియాన్‌లతో కలుషితమైనా కూడా వైరస్ సోకే ప్రమాదం ఉంది. ఒక జింకలో ఈ లక్షణాలు అభివృద్ధి చెందడానికి ఒక సంవత్సరం కాలం పట్టవచ్చు. జింక బరువును తీవ్రంగా కోల్పోవడం, మొత్తం శక్తిని కోల్పోయి నీరసించిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దప్పిక వేయడం, నోటినుంచి చొంగకారడం లాంటి సంకేతాలు ఉంటాయి.
వైరస్ బారినపడ్డ వ్యక్తుల్లో ప్రియాన్స్ అనే ప్రొటీన్లు అస్తవ్యస్తమవుతాయి.. అనంతరం కేంద్ర నాడీ వ్యవస్థ అంతటా ప్రయాణిస్తాయి. మెదడు కణజాలం, శరీర అవయవాలలో పేరుకుపోతాయి. కెనడాలోని సస్కట్చేవాన్, అల్బెర్టా, క్యూబెక్‌లలోని వ్యవసాయ జింకలు, అలాగే మానిటోబాలోని అడవి జింకలలో గతంలో ఈ వ్యాధి గుర్తించారు. అమెరికాలోని యెల్లోస్టోన్ నేషనల్ పార్కులో తొలి కేసు నిర్దారణ అయ్యింది.
అయితే, కెనడా ఆరోగ్య నిపుణులు మాత్రం.. ఇప్పటి వరకూ ఈ వైరస్ మనుషులకు సోకినట్టు ఎటువంటి ప్రత్యక్ష ఆధారాలు లేవని తెలిపారు. కానీ, మకాక్‌లపై గత పరిశోధనలు మనుషులకు ఈ వ్యాధి సంక్రమించడం సాధ్యమని సూచించాయని కాల్గరీ యూనివర్సిటీ వెటర్నరీ స్కూల్ శాస్త్రవేత్త హెర్మాన్ షెట్జల్ అన్నారు. ‘మా ప్రయోగాత్మక నమూనాలలో జాంబీ డీర్ వైరస్ మానవులకు సోకే అవకాశం ఉంది.. ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? వేట మాంసం తినడం వల్ల మనిషికి ఈ ప్రియాన్ వ్యాధి ఉందని మీరు చెప్పడానికి ఆధారాలు లేవు. అయితే భవిష్యత్తులో ఇది జరుగుతుందా? అంటే అవుననే సమాధానం వస్తుంది’ అని వ్యాఖ్యానించారు.