ఉన్మాది సీఎం జగన్ ఆగడాలను ప్రపంచానికి తెలియచేశాయనే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 ఛానళ్లపై విషం కక్కుతున్నారని టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. గురువారం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ కుటుంబం 60 ఏళ్ల రక్తచరిత్రను ప్రజలకు తెలియచేసిందనే ఆయన, ఆయన తండ్రి ఈనాడుపై కక్షకట్టారని మండిపడ్డారు. మార్గదర్శిపై తప్పుడు కేసులు పెట్టించి, రామోజీరావు ప్రతిష్ఠ మంటగలపడానికి ప్రయత్నించారని ధ్వజమెత్తారు. పాదయాత్ర సమయంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని ప్రజానాయకుడిగా ప్రజలకు పరిచయం చేసిన ఆంధ్రజ్యోతి తర్వాత ఆయనకు నచ్చకుండా పోవడానికి కారణం.. ఆయన చేసిన అవినీతిని ప్రశ్నించడమేనని అన్నారు. జగన్ పార్టీ పెట్టినప్పుడు విస్తృతమైన కవరేజ్ ఇచ్చిన టీవీ-5 ఛానల్, నేడు జగన్ ఆగ్రహానికి గురికావడానికి కారణమైందని చెప్పారు. అమరావతి ఉద్యమానికి అండగా నిలవడమే తాను చేసిన తప్పా అని ప్రశ్నించారు. జగన్‌కు నిజంగా ధైర్యముంటే, ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని, ప్రజలను ఉద్దరించి ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్‌కు ఎందుకు స్పందించలేదు..? అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో గెలుస్తాననే నమ్మకం జగన్‌కు ఉంటే, ఆయన ఒంటరిగా పోరాడే పులే అయితే తనకు గిట్టని మీడియా సంస్థలను స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వాలని కొలికపూడి శ్రీనివాసరావు సూచించారు.