ఏపీలో టీడీపీ, జనసేన ఉమ్మడి జాబితా విడుదలైంది. ఈ లిస్టుపై ఆ పార్టీల్లో అప్పుడే అసమ్మతి స్వరాలు కూడా మొదలయ్యాయి. మరోవైపు.. వైసీపీ నుంచి కూడా సెటైర్లు షురూ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేత, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పటి వరకూ తమదే సీటు అనుకుని ధీమాగా ఉన్న వైసీపీ లీడర్లు గందరగోళానికి గురౌతున్నారు. అధినేత ప్రకటించిన జాబితాల్లో ఇంఛార్జులుగా పేర్లు వచ్చాయని, సంబరపడుతున్న లీడర్లు.. వైవీ సుబ్బారెడ్డి మాటలతో పుసుకున్న ఇంత మాట అనేశారేంటీ అని ఆలోచనలో పడ్డారు. అయితే వైవీ సుబ్బారెడ్డి మాటల వెనుక వేరే మర్మం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
టీడీపీ, జనసేన విడుదల చేసిన తొలి జాబితాపై స్పందిస్తూ వైవీ సుబ్బారెడ్డి శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ మరో 40 స్థానాల్లో అభ్యర్థులను వెతుక్కునే పనిలో పడిందని విమర్శించారు. ఇదే సమయంలో వైసీపీ తరుఫున ఇప్పటి వరకూ ప్రకటించిన ఇంఛార్జులు కేవలం సమన్వయకర్తలు మాత్రమేనంటూ సుబ్బారెడ్డి బాంబు పేల్చారు. ఇప్పటివరకూ వైసీపీ విడుదల చేసిన లిస్టులలో పేర్లు వచ్చినవారు కేవలం సమన్వయకర్తలు మాత్రమేనని సుబ్బారెడ్డి తేల్చేశారు. తుదిజాబితాలో పేర్లు ఉన్నవాళ్లు మాత్రమే అభ్యర్థులని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. సిద్ధం సభ ఆఖరి మీటింగ్ తర్వాత మ్యానిఫెస్టోతో పాటు ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చారు. అప్పటి వరకూ ఇంఛార్జిలు పార్టీ కోసం నియోజకవర్గంలో సమన్వయం చేస్తారని తెలిపారు.
అయితే సుబ్బారెడ్డి వ్యాఖ్యలతో వైసీపీ లీడర్లు అయోమయంలో పడ్డారు. ఇంఛార్జులుగా నియమితులైన తర్వాత వైసీపీ లీడర్లు క్షేత్రస్థాయిలో పని మొదలెట్టేశారు. అసంతృప్తులను కలుపుకుని పోవటం సహా.. ఎన్నికల కోసం ఖర్చు చేయడం కూడా మొదలెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫైనల్ లిస్టులో పేరుంటేనే సీటు గ్యారంటీ అంటూ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలతో నేతలు గందరగోళంలో పడినట్లు తెలుస్తోంది. అయితే వైవీ సుబ్బారెడ్డి మాటల వెనుక రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
నియోజకవర్గాలకు ఇంఛార్జులుగా ప్రకటించిన నేతలు.. ఈ వ్యాఖ్యలతో సీటు కోసం మరింత శ్రమిస్తారని, నియోజకవర్గంలో ఎక్కువగా తిరిగి బలం పెంచుకుంటారనేది వైసీపీ ఆలోచన అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ఇప్పటికే అసంతృప్తితో ఉన్న నేతలు పక్కచూపులు చూడకుండా ఫైనల్ లిస్టు వరకూ ఎదురు చూస్తారనేది కూడా ఓ ఆలోచనగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కారణంగా సీట్లు దక్కని బలమైన నేతలను సైతం వైసీపీలోకి ఆకర్షించవచ్చనేది సుబ్బారెడ్డి మాటల వెనుక మర్మమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఇప్పటికే ఫుల్ జోష్‌లో ఉన్న వైసీపీ ఇంఛార్జులను వైవీ సుబ్బారెడ్డి ప్రకటన కలవరపాటుకు గురిచేసిందని చెప్పొచ్చు.