భారతీయులు ముఖ్యంగా దక్షిణాదివాసులు ఇష్టంగా తినే బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీదే అగ్రస్థానం. వేడి వేడి ఇడ్లీలో.. కొద్దిగా నెయ్యి, కారంపొడి తగిలించి, కొబ్బరి చట్నీతో తింటే.. ఆహా ఆ రుచి మాటల్లో చెప్పలేం. మరి అలాంటి ఇడ్లీ వల్ల జీవవైవిధ్యానికి ముప్పు పొంచి ఉందా? అంటే అవునని అంటోంది ఓ అధ్యయనం. కేవలం ఇడ్లీ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా 151 వంటకాలు జీవ వైవిధ్యానికి ముప్పుగా పరిణమించాయని తాజా అధ్యయనం వెల్లడించింది. వాటిలో ఇడ్లీతోపాటు పలు భారతీయ వంటకాలు ఉన్నాయి. చనా మసాలా, రాజ్మా, చికెన్ జాల్‌ఫ్రెజి వంటివి పర్యావరణానికి ముప్పుగా పరిణమించే మొదటి 25 వంటకాల్లో ఉండటం గమనార్హం.
వైవిధ్యానికి విఘాతం కలిగించే వంటకాల జాబితాలో స్పానిష్ రోస్ట్ ల్యాంబ్ డిష్ ‘లెచాజో’ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో బ్రెజిల్‌కు చెందిన మీట్ సెంట్రిక్ ఆఫెరింగ్స్ ఉండగా.. ఇడ్లీ ఆరో స్థానంలో, రాజ్మా కూర ఏడో స్థానంలో ఉన్నాయి. ఈ అధ్యయన ఫలితాలను సింగపూర్ యూనివర్సిటీ ఎలిస్సా చెంగ్ అండ్ కొలీగ్స్ ఆధ్వర్యంలో నడిచే ఓపెన్ యాక్సెస్ జర్నల్ ప్లాస్ (పీఎల్‌వోఎస్)లో ప్రచురించారు. అయితే,మాంసాహార వంటకాలతో పోల్చితే శాకాహారులు, శాకాహార వంటకాలు తక్కువ జీవ వైవిధ్య ఫుట్‌ప్రింట్స్ కలిగి ఉండటం ఆశ్ఛర్యకరం. కానీ, బియ్యం, పప్పుధాన్యాల ఆధారిత వంటకాలు కూడా అధిక స్కోరు సాధించడం శాస్త్రవేత్తలను విస్మయానికి గురిచేసింది.
‘భారత్‌లో ఎక్కువగా వినియోగించే చిక్కుళ్లు, బియ్యం వంటివి ఎక్కువ ప్రభావం చూపుతున్నట్టు వెల్లడికావడం ఆశ్చర్యాన్ని కలిగించాయి.. కానీ వాటి దాని గురించి ఆలోచించినప్పుడు అర్ధమవుతుంది’ అని అధ్యయనం పేర్కొంది. వ్యవసాయం క్షేత్రాల్లో క్షీరదాలు, పక్షులు, ఉభయచర జీవులపై పడే ప్రభావాన్ని కరాస్కో, అతడి సహచరులు అంచనా వేశారు. బియ్యం, పప్పుధాన్యాలతో కూడిన ఆహారం వల్ల జీవ వైవిధ్యంపై అధిక ప్రభావం పడుతుందని అధ్యయనంలో తేలింది. మన దేశంలో ధాన్యం, పప్పు ధాన్యాల సాగుకు తరచుగా భూమార్పిడి అవసరమని, ఈ కారణంగా అనేక జీవజాతులు ఆవాసాలు కోల్పోతున్నాయని అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది.
ఆహారం ఎంపిక సాధారణంగా రుచి, ధర, ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది, అయితే వంటకాలకు జీవవైవిధ్య ప్రభావ స్కోర్‌లను కేటాయించే అధ్యయనాలు పర్యావరణ స్పృహ ఉన్న వ్యక్తులు తమ ఆహార ఎంపికలను రూపొందించడంలో సహాయపడతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రధానంగా వ్యవసాయాన్ని విస్తరించడం వల్ల ఏర్పడే ఆవాసాలు, జీవవైవిధ్య నష్టం గురించి ఆందోళనల నేపథ్యంలో ఈ అధ్యయనం రావడం గమనార్హం. కుటుంబ సగటు ఆహార వినియోగం దాని పర్యావరణ ప్రభావంలో 20 నుంచి 30 శాతం వరకు ఉంటుందని మునుపటి అధ్యయనం అంచనా వేసింది.
‘మా విశ్లేషణలో జీవవైవిధ్య ముప్పు ఆ వంటకాన్ని ఉత్పత్తి చేయడానికి కనీసం పాక్షికంగా ప్రభావితమైన జాతుల మొత్తాన్ని లెక్కించింది’ అని కరాస్కో చెప్పారు. ఆ వంటకాన్ని తినడం ద్వారా మనం ఎన్ని జాతులను అంతరించిపోయేలా చేస్తున్నామో ఒక అవగాహన కల్పిస్తుందని వ్యాఖ్యానించారు. అయితే, గతంలో పలు అధ్యయనాలు మాంసాహార ఆహారం వల్ల పర్యావరణానికి ముప్పు ఉందని హెచ్చరించాయి.