ఎన్నికలు వస్తున్నాయనగానే నాయకులు చేసే హామీలు ఓ రేంజులో ఉంటాయి. అధికారమే పరమావధిగా లీడర్లంతా హామీలు గుప్పిస్తుంటారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అవసరమైతే కొండ మీద కోతిని కూడా తెచ్చిస్తామని చెబుతుంటారు. అయితే ఎన్నికలు ముగియగానే ఆ హామీలన్నీ నీటిమూటలుగా మిగిలిపోతుంటాయి. కానీ నంద్యాల జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత మాత్రం తాను అలా కాదంటున్నారు. మాట ఇస్తే తప్పేది లేదంటున్నారు. తన తల్లిదండ్రుల సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేరుస్తానంటూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గ అభ్యర్థిగా బీసీ జనార్ధన్ రెడ్డిని టీడీపీ అధిష్టానం ఇటీవల ప్రకటించింది. దీంతో ఆయన జోరుగా నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు. అయితే కొండపేటలోని చార్ కమాన్ మసీదుకు సంబందించి అసంపూర్తిగా ఉన్న కాంప్లెక్స్‌ని సొంత డబ్బులతో నిర్మించారు బీసీ జనార్ధన్ రెడ్డి. మూడు లక్షల రూపాయలు ఖర్చు చేసి మూడు గదులను నిర్మించారు. ఈ నిర్మాణాన్ని సోమవారం బీసీ జనార్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా నిర్వహించిన సభలో మాట్లాడిన బీసీ జనార్ధన్ రెడ్డి.. బనగానపల్లె ప్రజలపై హామీల వర్షం కురిపించారు.
బనగానపల్లెలోని పేదలకు తన సొంత డబ్బులతో రెండు సెంట్ల స్థలం ఇస్తానని బీసీ జనార్ధన్ రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తన తల్లిదండ్రుల మీద ఒట్టేసి చెప్తున్నానని.. సొంత డబ్బులతో 2 సెంట్ల స్థలం ఇచ్చి తీరుతానని వెల్లడించారు. తనపై, తన కుటుంబంపై గిట్టనివారు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్న బీసీ జనార్ధన్ రెడ్డి.. ఎప్పటికీ బనగానపల్లె ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేసేవారికి దేవుడే బుద్ధి చెప్తాడని అన్నారు. మరోవైపు బనగానపల్లె నియోజకవర్గంలో బాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొంటున్న బీసీ జనార్ధన్ రెడ్డి.. ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు.