ఏపీ ఎన్నికలకు టీడీపీ, జనసేన కూటమి సిద్ధమవుతోంది. తొలి జాబితాను ప్రకటించిన జోష్‌లో ఉండగా.. టికెట్ దక్కని నేతలకు బుజ్జగింపులు మొదలయ్యాయి. చంద్రబాబు స్వయంగా టికెట్ దక్కని నేతల్ని పిలిపి మాట్లాడుతున్నారు. అలాగే త్వరలోనే ప్రకటించబోయే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. టికెట్ ఆశిస్తున్నవారిని పిలిచి స్వయంగా మాట్లాడుతున్నారు. అయితే తొలి జాబితాలో రాజమహేంద్రవరం రూరల్ టికెట్‌పై క్లారిటీ ఇస్తారా, లేదా అనే ఉత్కంఠ నడిచింది. అయితే ఆ జాబితాలో ఈ స్థానానికి అభ్యర్థిని ప్రకటించలేదు.
ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జనసేన పార్టీ నేత కందుల దుర్గేష్‌లు టికెట్ ఆశిస్తున్నారు. ఈ క్రమంలో రాజమహేంద్రవరం వచ్చిన పవన్ కళ్యాణ్ రూరల్ సీటు దుర్గేష్‌కు ఖాయమని చెప్పినట్లు వార్తలొచ్చాయి. ఈ క్రమంలో ఇద్దరిలో ఎవరికి టికెట్ దక్కుతుందనే చర్చ జరిగింది.. ఇద్దరు నేతలు తమకే టికెట్ అంటూ ధీమాతో ఉన్నారు. అటు టీడీపీ సీనియర్ నేత కావడం.. ఇటు జనసేన పార్టీలో ముఖ్య నేత కావడంతో సందిగ్థం ఏర్పడింది. అయితే ఈ సీటుపై దాదాపు క్లారిటీ వచ్చేసినట్లు చెబుతున్నారు.
రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన టికెట్ ఆశిస్తున్న కందుల దుర్గేశ్‌ను నిడదవోలు నుంచి పోటీ చేయించబోతున్నారని చెబుతున్నారు. నిడదవోలు రాజమహేంద్రవరం సమీపంలోనే ఉండటం.. జనసేనకు పట్టున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శనివారం రాత్రి దుర్గేష్‌కు స్పష్టత ఇచ్చారని తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం సీట్లు ప్రకటించాక పవన్ మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి దుర్గేష్‌ను పిలిపించి మాట్లాడారు. రాజమహేంద్రవరం రూరల్ నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి బరిలో దిగుతున్నట్లు దుర్గేష్‌కు పవన్ స్వయంగా చెప్పారట. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
ఒకవైపు టీడీపీ సిట్టింగ్ అభ్యర్థులందరికీ సీట్లు కేటాయిస్తుండటం.. ఇదే సమయంలో రాజమహేంద్రవరం టీడీపీ స్థానాన్ని జనసేన ఆశించడంతో ఉత్కంఠ నెలకొంది. చివరికి నిడదవోలు నుంచి దుర్గేష్‌ను బరిలో దిగుతారని ఉత్కంఠకు తెరదించారు. దుర్గేష్ మాత్రం సోమవారం కార్యకర్తలతో విస్తృత చర్చల అనంతరం అభిప్రాయం తెలియజేస్తానని పార్టీ అధ్యక్షుడికి చెప్పానని.. పొత్తు ఉన్నప్పుడు రెండు పార్టీల అధినేతలపైనా ఒత్తిళ్లు ఉంటాయననారు. దీని వల్ల నిర్ణయాలు మార్చుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయన్నారు.
చంద్రబాబు సైతం నిడదవోలులో టీడీపీ మంచి క్యాడర్ ఉందని, వారు సహకరిస్తారని తనతో చెప్పారన్నారు. వైఎస్సార్‌సీపీ నేతకు తమ పార్టీ అభ్యర్థుల ఎంపిక నిర్ణయంపై మాట్లాడే అర్హత లేదని.. ఆ పార్టీలో ఏ నాయకుణ్ని ఎక్కడికి పంపిస్తున్నారో ముందు తెలుసుకోవాలని దుర్గేష్ విమర్శించారు. జనసేన కేడర్ కొంత బాధతో ఉన్నమాట వాస్తవమేనని, వారందర్నీ సముదాయించి పార్టీ నిర్ణయానికి కట్టుబడేలా చేస్తామన్నారు. పార్టీ వీడే యోచన లేదని, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండే ఆలోచన లేదన్నారు.