వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరుఫున పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఏడు విడతల్లో ఇంఛార్జులను ప్రకటించిన వైఎస్ జగన్.. ఫైనల్ లిస్టు దాదాపు ఖరారైనట్లు తెలిపారు. 99 శాతం మార్పులు పూర్తయ్యాయని.. ఇకపై పెద్దగా మార్పులు ఉండవని స్పష్టం చేశారు. టికెట్ గురించి ఆలోచించకుండా ఇక ప్రచారానికి శ్రీకారం చుట్టాలని పార్టీశ్రేణులకు, అభ్యర్థులకు మార్గనిర్దేశం చేశారు. తాడేపల్లిలో 'మేం సిద్ధం- మా బూత్ సిద్ధం' పేరిట జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఎన్నికలను ఎలా ఎదుర్కొనాలనే దానిపై సీఎం జగన్ కీలక సూచనలు చేశారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మరో 45 రోజుల సమయం మాత్రమే ఉందన్న జగన్.. రాష్ట్రంలో వైసీపీ గ్రౌండ్ లెవల్ నుంచి బలంగా ఉందన్నారు. రేపటి నుంచి 45 రోజులు చాలా కీలకమని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపైనా విమర్శలు గుప్పించిన జగన్.. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తారని ఆరోపించారు. అలాగే 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు తనకు ఇప్పటికీ గుర్తున్నాయని.. వాటిని వైసీపీ నేతలకు కూడా గుర్తుచేశారు. దీంతో సమావేశ మందిరంలో నవ్వులు విరిశాయి.
" బంగారు రుణాలు, రైతు రుణమాఫీ ఇలా చంద్రబాబు ఇచ్చిన చెత్త ప్రకటనలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి, అబద్ధాలు చెప్పటంలో చంద్రబాబు నేర్పరి. 2014లో టీడీపీ ఇచ్చిన ఓ ప్రకటన నాకు గుర్తుంది. బ్యాంకులో పెట్టిన బంగారం బయటకు రావాలంటే బాబు రావాలంటూ.. తాళిబొట్లు తీసుకెళ్తున్న ప్రకటన ఇచ్చారు. అది నాకింకా గుర్తుంది. కానీ అమలు మాత్రం చేయలేదు. కనీసం సాధ్యమవుతుందో లేదో కూడా తెలియకుండానే చంద్రబాబు ఈ వాగ్దానాలన్నీ చేశారు.మనం అలా చేయం. చేసేదే చెప్తాం. చెప్పింది చేస్తాం. ఇచ్చిన హామీలు నేరవేర్చకపోగా వారి పార్టీ వెబ్‌సైట్‌లో నుంచి టీడీపీ మేనిఫెస్టోను కూడా తీసేసింది. టీడీపీ కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి ఏం చెబుతారు" అంటూ జగన్ ప్రశ్నించారు.
మరోవైపు వైసీపీ అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిందన్న జగన్.. వైసీపీ కార్యకర్తలు, నేతలు సగర్వంగా ఇళ్లవద్దకు వెళ్లి ఓట్లు అడగొచ్చని చెప్పారు. కుప్పంలో 93.29%తో కలిపి వైసీపీ ప్రభుత్వం ద్వారా 87% కుటుంబాలు ప్రయోజనం పొందాయని అన్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో జరిగేది క్యాస్ట్ వార్ కాదు, క్లాస్ వార్ అని చెప్పిన జగన్.. పేదలకు పెత్తందారులకు మధ్యన జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించారు. వైఎస్‌ఆర్‌సీపీకి ఓటు వేయకపోతే వైసీపీ ప్రభుత్వంలో వస్తున్న సంక్షేమం అంతా ఆగిపోతుందని అందరిగి అవగాహన కల్పించాలని సూచించారు.
"ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలందరూ తమ బూత్ సామర్థ్యాన్ని అంచనా వేయాలి. బూత్‌స్థాయిలో పార్టీని వీలైంత తొందరగా యాక్టివేట్ చేయాలి.ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్ గా తీసుకోండి. ఒక విశ్వసనీయ వ్యక్తిని నియమించండి. ఈ వ్యక్తి మన కార్యకర్తలను సన్నద్ధం చేయడంతోపాటు వారిని పర్యవేక్షించగలగాలి. అలాగే మీరంతా ఎప్పుడూ వారికి అందుబాటులో ఉండాలి. అర్ధరాత్రి కాల్స్ వచ్చినా, మీరు వాటికి సమాధానం ఇవ్వాలి. బూత్‌స్థాయిలో ఓటర్లను ఎన్నికలలోపు కనీసం ఐదారుసార్లు కలివండి. వాలంటీర్లు, గృహ సారథిలతో సమన్వయపరచుకుంటూ ఒక సొంత బృందాన్ని తయారు చేసుకోండి" అని పార్టీ శ్రేణులకు జగన్ సూచించారు.
ఇక ఇప్పటి వరకు అన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించేశామన్న జగన్. దాదాపు ఇవే ఫైనల్ అని స్పష్టం చేశారు,. టికెట్ల గురించి ఆలోచించాల్సిన పనిలేదనీ.. చేయాల్సిందల్లా లబ్ది పొందిన ప్రతి గడపకు వెళ్లి చేసిన మంచిని ఓట్లుగా మార్చుకోవటమేనని అన్నారు. వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళ్లి లక్ష్యాన్ని సాధించాలని పార్టీ శ్రేణులకు జగన్ సూచించారు.