టీడీపీ నేత, పి. గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి మహాసేన రాజేష్‌కు జనసైనికులు షాకిచ్చారు. కోనసీమ జిల్లా అంబాజీపేటలో నిర్వహించిన టీడీపీ, జనసేన సమన్వయ సమావేశంలో రాజేష్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహాసేన రాజేష్‌కు పి.గన్నవరం టికెట్ ఇవ్వడాన్ని జనసైనికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం అంబాజీపేటలో నిర్వహించిన టీడీపీ, జనసేన సమావేశం జనసేన కార్యకర్తల నినాదాలతో రసాభాసగా మారింది. సమావేశానికి వచ్చిన టీడీపీ నేత హరీష్ మాధుర్ మీద దాడికి యత్నించారు. ఆయన కారును సైతం ధ్వంసం చేశారు. దీంతో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.
మరోవైపు మహాసేన రాజేష్‌కు గుర్తింపు పొందిన సరిపెళ్ల రాజేష్ కుమార్‌కు పి.గన్నవరం అసెంబ్లీ టికెట్ కేటాయిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించారు. తొలుత వైసీపీ మద్దతుదారుడిగా ఉన్న రాజేష్.. ఆ తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు. ఆ తర్వతా సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా మహాసేన రాజేష్‌గా గుర్తింపుపొందారు. అనంతరం జనసేనలో చేరతారనే వార్తలు వచ్చినప్పటికీ టీడీపీ గూటికి చేరారు. పి. గన్నవరం టికెట్ సంపాదించుకున్నారు. అయితే మహాసేన రాజేష్‌కు టికెట్ కేటాయించడాన్ని కొంతమంది జనసేన కార్యకర్తలు తప్పుబడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా మహాసేన రాజేష్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ మీద రాజేష్ చేసిన వ్యాఖ్యలను షేర్ చేస్తూ.. మండిపడుతున్నారు. ఇదే సమయంలో గత ఎన్నికల్లో పి.గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ, జనసేనకు వచ్చిన ఓట్ల శాతాన్ని గుర్తు చేస్తున్నారు. జనసేన బలంగా ఉన్న ఇలాంటి నియోజకవర్గాన్ని టీడీపీకి కేటాయించడంపైనా జనసేనలో ఓ వర్గం మండిపడుతోంది. ఈ క్రమంలో అంబాజీపేటలో నిర్వహించిన టీడీపీ, జనసేన సమన్వయ సమావేశంలో కొంతమంది ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసి బీభత్సం సృష్టించారు.