ఆంధ్ర టీమ్‌కు ఆడబోనంటూ టీమిండియా క్రికెటర్ హనుమ విహారి ప్రకటించడం ఏపీ రాజకీయాల్లోనూ దుమారం రేపుతోంది. విహారి నిర్ణయంపై రాజకీయ నేతలు కూడా స్పందిస్తున్నారు.. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ అంశంపై స్పందించారు. కొందరి రాజకీయ కక్షలకు, ప్రతీకార రాజకీయాలకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లొంగిపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమ విహారి ఆంధ్రప్రదేశ్ తరఫున ఎప్పటికీ ఆడబోనని ప్రకటించేలా వేధించారని ఆరోపించారు. తాము అండగా ఉండి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. విహారి ఆత్మవిశ్వాసంతో ఉండాలని.. క్రికెట్‌పై విహారికి ఉన్న నిబద్దతను రాజకీయ కుట్రలు ఏమీ చేయలేవన్నారు. ఇలాంటి చర్యల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షించరు అన్నారు.
హనుమ విహారికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా మద్దతు తెలిపారు. రాజకీయ జోక్యంతో హనుమ విహారి ఆంధ్ర జట్టుకు దూరం కావడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు లోకేష్. విహారి రెండు నెలల్లోనే ఏపీ తరఫున తిరిగి ఆడటానికి రావాలని ఆహ్వానించారు లోకేష్. విహారితో పాటుగా టీమ్‌కు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతామన్నారు. ఆంధ్రా క్రికెట్ జట్టు రంజీ ట్రోఫీ గెలిచేందుకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ ఏడాది రంజీ సీజన్ మధ్యలోనే తాను ఆంధ్ర జట్టుకు కెప్టెన్‌గా ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో విహారి చెప్పుకొచ్చాడు. రాజకీయ నేతల జోక్యంతోనే కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నానని సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు. టీమ్‌కు సంబంధించిన విషయంలో ఓ రాజకీయ నేత కుమారుడైన ఆటగాడితో గొడవ వల్ల.. ఏసీఏ పెద్దలు తనపై వేటు వేశారని ఆరోపించాడు. ఈ నిర్ణయం తనను ఎంతో వేదనకు గురి చేసిందనీ, భవిష్యత్‌లో ఆంధ్ర జట్టుకు ఆడబోనని ప్రకటించాడు. జట్టులోని 17వ ఆటగాడిపై తాను అరిచానని.. దీంతో అతడు రాజకీయ నాయకుడైన తన తండ్రికి ఫిర్యాదు చేశాడన్నారు.
తనపై చర్యలు తీసుకోవాలని ఆ రాజకీయ నేత ఏసీఏపై ఒత్తిడి చేయడంతోనే.. తనవైపు తప్పు లేకున్నా, కెప్టెన్‌గా వైదొలగమని సూచించారన్నారు. జట్టు కోసం ఎంతగానో పోరాడి, గాయం వేధిస్తున్నా బ్యాటింగ్ చేసి, ఆంధ్రను ఐదుసార్లు నాకౌట్ దశకు తీసుకెళ్లి తన అంకితభావాన్ని చాటుకున్నానని చెప్పుకొచ్చారు. భారత జట్టు తరఫున 16 టెస్టులు ఆడా.. అయినా తనకంటే అతడే వాళ్లకు ముఖ్యుడయ్యాడని ఘాటుగా స్పందించాడు విహారి. అసోసియేషన్ తీరుతో ఎంతో వేదనకు గురయ్యానని.. తన ఆత్మగౌరవం దెబ్బతినేలా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే ఆంధ్రకు ఆడకూడదని తాను నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. హనుమ విహారికి పలువురు క్రికెటర్లు మద్దతు తెలుపుతున్నారు.