మాజీ సీఎం చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ అనేది పేద, మధ్య తరగతి ప్రజల మేనిఫెస్టో అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తెలిపారు. ఇందులో పొందుపరచిన హామీలపై విస్తృతంగా ప్రచారం చేయాలని.. ప్రతి గడపకూ వెళ్లి తెలియజేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి పట్టణాలు, మండలాలు, దుగ్గిరాల మండలానికి చెం దిన క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌చార్జులతో బుధవారం ఉండవల్లిలో ఆయన వేర్వేరుగా భేటీ అయ్యారు. రైతులు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న అనేక సమస్యలను నేతలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. 2019 ఎన్నికల సమయంలో 20 రోజులు ముందు మాత్రమే మంగళగిరికి వచ్చానని, స్వల్ప వ్యవధిలో ఇక్కడి ప్రజలకు చేరువ కాలేకపోవడం వల్లే ఓడిపోయానని చెప్పారు. అయినప్పటికీ ఐదేళ్ల నుంచి మంగళగిరిలోనే ప్రజల మధ్య తిరుగుతూ అనేక సంక్షేమ కార్యక్రమాలను సొంత నిధులతో అమలు చేస్తున్నానని తెలిపారు. తాను గెలిస్తే ఇంకెన్ని సంక్షేమ ఫలాలు అందుతాయో ప్రజలకు వివరించాలన్నారు. ‘మంగళగిరిలో నేను గెలిస్తే కాలువ కట్టలపై పేదల ఇళ్లు తొలగిస్తారని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు. కానీ వైసీపీ గెలిచాక వారే పేదల ఇళ్లను కూల్చివేశారు. సీఎం జగన్ ఇంటి వద్ద పేదలు నివాసం ఉండడమే నేరం అన్నట్లుగా అర్ధరాత్రి పేదల ఇళ్లను ఖాళీ చేయించి వారిని తరిమివేశారు’ అని ధ్వజమెత్తారు.