వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాకూడదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి డాక్టర్ వైఎస్ సునీత రెడ్డి. ఈసారి ఎన్నికల్లో తనకు ప్రజల సహకారం కావాలని.. ప్రజలు ఓటు ద్వారా తీర్పు ఇవ్వాలని కోరారు. ఇక్కడ రాజకీయం కోసం కాదు.. న్యాయం కోసం తీర్పు ఇవ్వమని కోరారు. జగన్‌కు ఓటేయొద్దని చెబుతున్నానని.. ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు ఉండకూడదన్నారు. హత్యలు చేసేవాళ్లు రాజకీయాల్లో, ప్రభుత్వాల్లో ఉండకూడదు, పాలించకూడదని.. మరోసారి తన అన్న ప్రభుత్వం అధికారంలోకి వస్తే తన తండ్రి హత్య కేసుకు న్యాయం జరగదన్నారు. వైఎస్సార్‌సీపీకి ఓటు వేయొద్దు.. వంచన చేసిన, మోసం చేసిన పార్టీకి ఓటు వేయొద్దు అని కోరారు. సీబీఐపై ఎలాంటి ఒత్తిడి ఉందో తనకు తెలియదని.. ఎవరో అడ్డుపడుతున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా తాను ఆరోపణలు చేయకూడదన్నారు.
కష్ట సమయంలో తమకు అండగా నిలిచినవారికి ధన్యవాదాలు తెలిపారు సునీత. లాయర్లు, తోటి డాక్టర్లు, మరికొందరు స్నేహితులు, సన్నిహితులు మద్దుతగా నిలబడ్డారని.. తాను ఎక్కడికి వెళ్లినా వివేకా హత్య గురించి అడుగుతున్నారని.. ఎంతోమంది రాజకీయ పార్టీ నేతలు తనకు చాలా అండగా ఉన్నారన్నారు. తన సోదరి వైఎస్ షర్మిల కూడా డే 1 నుంచి తనకు సహకరించారని.. మద్దతుగా నిలిచారన్నారు. ఈ కేసు విచారణ ఇంకా ముందుకు వెళ్లేందుకు అందరూ సహకరించాలని.. ప్రజల దగ్గర నుంచి తీర్పు కావాలి.. ప్రజా తీర్పు కావాలి అన్నారు. ఈ ఐదేళ్లు ఏం జరిగిందో ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు.
ఏదైనా హత్య కేసులో నాలుగైదు రోజుల్లో ఎవరు చేశారో తెలుస్తుందని.. కానీ తన తండ్రి హత్య కేసు మాత్రం ఐదేళ్లు అవుతున్నా నిందితుల్ని పట్టుకోలేదన్నారు. 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డి పోటీ చేశారని.. ఆయన్ను సొంతవాళ్లు ఓడించారన్నారు. ఓటమి తర్వాత సైలెంట్ అవుతారని అనుకున్నా... రెట్టింపు ఉత్సాహం తో ప్రజల్లోకి వెళ్లారన్నారు. తమకు ఈ ఘటన జరిగిన సమయంలో ఏం అర్థంకాలేదు.. తామూ అన్ని విషయాలు తెలుసుకోవడానికి సమయం పట్టిందన్నారు.
చనిపోయే ముందు రోజు కూడా అవినాష్ కోసం, జగనన్న కోసం వైఎస్ వివేకానందరెడ్డి ప్రచారం చేశారన్నారు. 'హంతకులు మన మధ్యలోనే ఉంటారు.. కానీ పట్టుకోలేకపోతున్నారు' అన్నారు. తన తల్లి సీబీఐకి కేసును బదిలీ చేయాలని పిటిషన్ వేశారని.. తన సోదరుడు జగన్ కూడా పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఎన్నికల తర్వాత జగన్ గెలిచారని.. సొంత బాబాయి చంపిన వాళ్లను పట్టుకోవాలని అధికారంలోకి వచ్చిన తర్వాత అనుకోవాలి.. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్‌ను జగన్ ఉపసంహరించుకున్నారన్నారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
ఆ తర్వాత కేసు ముందుకు వెళ్లలేదు.. కడప జిల్లాలో పోలీసుల్ని బదిలీ చేశారన్నారు. ఏపీ హైకోర్టు ఆదేశాలతో 2020లో సీబీఐ విచారణ మొదలు పెట్టిందని.. అరెస్టులు, ఛార్జ్‌షీట్‌లకు ఏడాది సమయం పట్టిందన్నారు. శివశంకర్ రెడ్డి అరెస్ట్‌తో కేసు మొత్తం మారిపోయిందని.. ఆ తర్వాత భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి పేర్లు బయటపడ్డాయన్నారు. అప్పటి నుంచి సీబీఐ ఆఫీసర్లపై కేసులు పెట్టడం మొదలుపెట్టారని.. 2022లో సీబీఐ అధికారులు కడప నుంచి వెళ్లిపోయారన్నారు. మరి దర్యాప్తు ఎవరు చేస్తారని.. సుప్రీం కోర్టు కూడా విచారణను త్వరగానే పూర్తి చేయాలని సుప్రీం కోర్టు చెప్పిందని.. తెలంగాణ హైకోర్టుకు కేసు విచారణను బదిలీ చేశారన్నారు.
హైదరాబాద్‌లో సీబీఐ విచారణ ప్రారంభమైంది.. వైఎస్ అవినాష్ రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చిందన్నారు. సీబీఐ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తే తనకు తీరిక లేదని అవినాష్ రెడ్డి తప్పుకునే ప్రయత్నం చేశారన్నారు. ఆ తర్వాత కర్నూలులో ఏమైందో అందరికీ తెలుసని.. అవినాష్ తల్లిని చేర్చిన ఆస్పత్రి దగ్గర హైడ్రామా నడిచింది.. కనీసం లోపలికి ఎవరినీ వెళ్లనివ్వలేదన్నారు. రెండు రోజుల డ్రామా తర్వాత.. ఆయనకు ముందస్తు బెయిల్ వచ్చింది.. మళ్లీ దర్యాప్తు ఆగిపోయింది అన్నారు. జూన్ 30న ఛార్జ్‌షీట్ ఫైల్ చేస్తే.. ఇవాళ మార్చి 1.. ఇప్పటి వరకు కేసు ఏమైందో తెలియదన్నారు.
విలువలు, విశ్వసనీయత.. మాట తప్పను, మడమ తిప్పను అంటారు.. అక్కాచెల్లెమ్మ అని పదే పదే అంటుంటారని.. కానీ తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి విషయంలో ఇవి గుర్తుకురావా.. చెల్లెమ్మకు ఇచ్చిన మాట ఏమైందని అని ప్రశ్నించారు. దుష్ట చతుష్టయం అని ప్రతిపక్షాలకు పేరు పెట్టారని.. మరి వివేకాను చంపిన దుష్టులను వదిలేస్తే ఎలా.. వారిని వదిలేయడం కాదు, వారికి వత్తాసు పలికి మద్దతు తెలపడం ఏ విధంగా అర్థం చేసుకోవాలన్నారు. మంచికి చెడుకు యుద్ధం అంటారు.. ఇక్కడ ఏది మంచి, ఏది చెడు చంపినవాళ్లను కాపాడటం చేయడం మంచిదా అని ప్రశ్నించారు.
మంచికి చెడుకు యుద్ధం జరుగుతోంది అని చెబుతున్నారని.. తాను తన పోరాటం గురించి చెబుతున్నా..న్యాయం కోసం పోరాడుతున్నానన్నారు. పేదలకు, పెత్తందారులకు యుద్ధం అంటారు.. ఇక్కడ పెత్తందారులు నిందితుల్ని కాపాడుతూ, సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారన్నారు. సీబీఐకి ఫిర్యాదు చేసినందుకు తనను, తన భర్తను వేధిస్తున్నారని.. విశాఖలో డాక్టర్ సుధాకర్ పరిస్థితి ఏమైందో అందరికి తెలుసు.. ఆయన కోసం ఎవరు పోరాడుతున్నారు.. ఎమ్మెల్సీ డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేస్తే ఎవరు పట్టించుకుంటారన్నారు. ఈ కేసులో తమపైనా ఆరోపణలు వచ్చాయని.. తనతో పాటూ తన భర్తను కూడా పిలిచి సీబీఐ ప్రశ్నించిందన్నారు.