ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఆస్తి పన్ను బకాయిలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధిక మొత్తంలో పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలపై దృష్టి పెట్టిన ఏపీ సర్కారు.. అందులో భాగంగా ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. వన్ టైమ్ సెటిల్‌మెంట్ విధానం ద్వారా బకాయిలు చెల్లించిన వారికి వడ్డీ మాఫీ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది.
భవనాలు, ఖాళీస్థలాల ఆస్తిపన్నుల బకాయిలను మార్చి నెలాఖరులోగా ఒకేసారి చెల్లించినవారికి మున్సిపల్ శాఖ ఈ వెసలుబాటు కల్పించింది.. కరోనా మహమ్మారితో పాటుగా ఆస్తిపన్ను రివిజన్ కారణంగా పట్టణాల్లో అధిక మొత్తంలో ఆస్తి పన్ను బకాయిలు పడినట్లు మున్సిపల్ శాఖ తెలిపింది. ఈ మేరకు అధికారుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను బకాయిలను ఒకేసారి చెల్లించినవారికి వడ్డీ మాఫీ చేయనున్నట్లు తెలిపింది. మార్చి 31వ తేదీలోగా చెల్లిస్తే వడ్డీ మాఫీ వర్తిస్తుందని తెలిపింది. ఏపీలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలోని ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని స్పెషల్ సి ఎస్ శ్రీ లక్ష్మీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో 90 శాతం రాయితీ ఇస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటుగా.. అన్ని మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను బకాయిల వడ్డీపై 90 శాతం రాయితీ ఇస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో ఉత్తర్వులు వెలువడిన మరుసటి రోజే.. ఏపీ ప్రభుత్వం కూడా ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీని మాఫీ చేయాలని నిర్ణయించింది.