ఈ నెల 18 వ తేదీన భానుడిపై తొలిసారి ఒక నల్ల మచ్చను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. వారం రోజుల క్రితం దాని నుంచి భూమి వైపు మూడు సౌరజ్వాలలు వెలువడటం తీవ్ర భయాందోళనలకు కలిగిస్తోంది. ఈ సౌర జ్వాలలతో హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగింది. అయితే కరోనల్ మాస్ ఎజెక్షన్స్ లేకపోవటంతో పెద్దగా నష్టం సంభవించలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ నెల 24, 26 మధ్య కేవలం రెండు రోజుల్లోనే ఆ మచ్చ ఏకంగా 25 శాతం పెరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది.2019 లో మొదలైన ప్రస్తుత 25వ సౌరచక్రంలో సూర్యుడిపై ఏర్పడిన అతిపెద్ద మచ్చ ఇదేనని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మచ్చకు ఏఆర్3590 అని పేరుపెట్టారు. ఏఆర్ అంటే యాక్టివ్ రీజియన్ అంటే క్రియాశీల ప్రాంతం అని అర్థం. సౌరజ్వాలలకు పుట్టినిల్లయిన ఈ మచ్చలు అంతరిక్ష వాతావరణం, సౌరవ్యవస్థలోని గ్రహాలపై ప్రభావం చూపుతాయి.
సూర్యుడి ఉపరితలంపై భారీ వైశాల్యంలో ఏర్పడే ఈ మచ్చల అయస్కాంత క్షేత్రం భూ అయస్కాంత క్షేత్రం కంటే 2500 రెట్లు శక్తివంతమైందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ మచ్చ 3600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ప్రస్తుతం 25వ సౌరచక్ర ప్రక్రియ కొనసాగుతుండగా.. ఈ సౌరచక్రం భూమికి అనర్థాలు, చిక్కులు తెచ్చిపెడుతుందేమోనని శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటీవల సూర్యుడిపై తరచూ మచ్చలు ఏర్పడి, తీవ్ర సౌర తుపాన్లు ఏర్పడటం చూస్తుంటే సూర్యుడు తన 11 ఏళ్ల సౌరచక్రంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నాడని.. మహోగ్ర విస్ఫోట దశను సమీపిస్తున్నాడని అంచనా వేస్తున్నారు.
2024 జూలైలోపే సోలార్ మాగ్జిమమ్ దశ వస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. భూమిపై ఇది ఎలాంటి ఉపద్రవాలకు దారి తీస్తుందోనని శాస్త్రవేత్తలు కలవరపడుతున్నారు. ఈ సోలార్ మాగ్జిమమ్ తర్వాత సూర్యుడు మళ్లీ నెమ్మదిస్తాడని.. అది జరిగిన 6 నెలల తర్వాతే ఖగోళవేత్తలు దాన్ని గుర్తించగలరు. సూర్యుడు లోలోపల ప్రజ్వలిస్తూ.. ఉపరితలంపై కొన్ని చోట్ల అకస్మాత్తుగా విస్ఫోటనం చెందుతాడు. అప్పుడు ఒక్కసారిగా భారీగా విద్యుదయస్కాంత వికిరణం విడుదలవుతుంది. వాటిని సౌరజ్వాలలు అంటాం. ఇవి సూర్యుడి ఉపరితలంపై అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తాయి.
సూర్యుడిలో 11 ఏళ్లకోసారి సౌరచక్రం తిరుగుతుంది. ఈ కాలచక్ర మధ్యంలో సౌరక్రియ గరిష్ట స్థితిని ‘సోలార్ మాగ్జిమమ్’ అంటారు. సూర్యుడి అయస్కాంత క్షేత్రం దాని అయస్కాంత ధ్రువాలను తారుమారు చేస్తుంది. అలా ఉత్తర అయస్కాంత ధ్రువం కాస్తా దక్షిణ అయస్కాంత ధ్రువంగా మారిపోతుంది. ఈ మార్పడి జరిగేవరకు సూర్యుడు అంతకంతకూ ఉత్తేజితం అవుతూ ఉంటాడు. సౌరమచ్చలు, జ్వాలలు, సీఎంఈలు వస్తూ ఉంటాయి. కరోనా అనేది సౌర ధూళికణాలతో నిండిన సూర్యుడి అతి బాహ్య పొర. సౌర ప్రజ్వలనాలు కరోనల్ మాస్ ఎజెక్షన్స్‌కు కారణం అవుతాయి. కరోనా నుంచి ప్లాస్మా, విద్యుదయస్కాంత వికిరణం భారీగా విడుదలై భూ అయస్కాంత క్షేత్రంలోకి వచ్చి దుష్ప్రభావాలు చూపుతాయి. ‘నార్తర్న్ లైట్స్’గా పిలిచే ‘అరోరాలు’ సాధారణంగా ధ్రువాల వద్దనే కనిపిస్తాయి. కానీ సీఎంఈల వల్ల తలెత్తే భూ అయస్కాంత తుపాన్లు భూమధ్యరేఖ వద్ద ‘అరోరా’లను సృష్టిస్తాయి.
1989 మార్చిలో సంభవించిన కరోనల్ మాస్ ఎజెక్షన్ కారణంగా కెనడా అల్లకల్లోలం అయింది. క్యూబెక్ ప్రావిన్స్ అంతటా 9 గంటలపాటు విద్యుత్ స్తంభించి 60 లక్షల మంది అవస్థలు పడ్డారు. అలాంటి సందర్భాల్లో జీపీఎస్ నేవిగేషన్ వ్యవస్థలు అస్తవ్యస్తమై నౌకలు, విమానాల రాకపోకలు, ఇతర ప్రజా రవాణా వ్యవస్థలు కూడా స్తంభిస్తాయి. టెలిఫోన్, కంప్యూటర్, కమ్యూనికేషన్, ఇంధన సరఫరా పైపులైన్‌లు ధ్వంసం అవుతాయి. ఈ క్రమంలోనే సౌరతుపాను గడిచేదాకా కృత్రిమ శాటిలైట్లను స్విచాఫ్ చేస్తారు. లేకపోతే అవి భూమిపై పడి లక్షల కోట్ల ఆస్తినష్టం జరుగుతుంది. వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయటకు రాకుండా ఉంటారు. 1860లో సోలార్ మాగ్జిమమ్ దశకు కొన్ని నెలల ముందు 1859 సెప్టెంబరులో ఓ సౌర తుపాను సంభవించింది. చరిత్రలో రికార్డయిన అతి పెద్ద సౌర తుపాను అదే.