నిత్యం రద్దీగా ఉండే కర్ణాటక రాజధాని బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన పేలుడు.. దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ పేలుడు ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. అయితే ఈ పేలుడు సంభవించిన తర్వాత అంతా అది గ్యాస్ సిలిండర్ కారణం అనుకున్నా.. ఓ గుర్తు తెలియని వ్యక్తి కేఫ్‌లో వదిలి వెళ్లిన బ్యాగులోని టిఫిన్ బాక్స్‌లో ఉంచిన ఐఈడీ పేలినట్లు కర్ణాటక ప్రభుత్వం తాజాగా నిర్ధారించింది.
ఈ మేరకు స్వయంగా సీఎం సిద్ధరామయ్య అధికారికంగా ప్రకటించారు. అయితే ఓ వ్యక్తి రామేశ్వరం కేఫ్‌లో బ్యాగును ఉంచి వెళ్లిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడం ఈ కేసులో కీలకంగా మారింది. ఇక పేలుడు జరిగిన ప్రాంతంలో నట్లు, బోల్టులు, కరెంటు వైర్లు గుర్తించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇక కుండనహల్లి ప్రాంతంలో ఉన్న రామేశ్వరం కేఫ్ పేలుడులో గాయపడిన వారి సంఖ్య 9 కి చేరింది. కేఫ్‌లో పేలుడు సంభవించిన వెంటనే హోటల్ సిబ్బంది, కస్టమర్లు, స్థానికులు తీవ్ర భయాందోళనతో పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బాంబు స్క్వాడ్, క్లూస్ టీం అధికారులు రామేశ్వరం కేఫ్ దగ్గరికి చేరుకుని ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. భారీ పేలుడు జరిగినా ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక గాయపడిన వారిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక పేలుడు జరిగిన రామేశ్వరం కేఫ్‌కు కర్ణాటక డీజీపీ డాక్టర్ అలోక్ మోహన్ చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బెంగళూరు పోలీస్ కమిషనర్ బి. దయానంద సహా ఇతర పోలీసుల మాట్లాడారు. పేలుడు జరిగిన ప్రాంతంలో ఫోరెన్సిక్ బృందం ఆధారాలను సేకరించింది.
ఇక ఈ ఘటనపై బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. పేలుడు గురించి రామేశ్వరం కేఫ్ ఫౌండర్ నాగరాజ్‌కు ఫోన్ చేసి తెలుసుకున్నట్లు బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య ట్వీట్ చేశారు. గ్యాస్ సిలిండర్ పేలలేదని.. ఓ కస్టమర్ వదిలి వెళ్లిన బ్యాగులో నుంచి పేలుడు సంభవించినట్లు చెప్పారని పేర్కొన్నారు.ఈ ఘటనపై సీఎం సిద్ధరామయ్య పూర్తి వివరణ ఇవ్వాలని తేజస్వీ సూర్య డిమాండ్ చేశారు. మరోవైపు.. ఈ పేలుడుపై బీజేపీ నేత పీసీ మోహన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.