ఆదాయపు పన్ను అధికారులు నిర్వహించిన సోదాల్లో పట్టుబడిన వాహనాలు చూసి వారే అవాక్కయ్యారు. ఎందుకంటే అన్నీ రోల్స్ రాయిస్, లాంబోర్గినీ, మెక్‌లారెన్, పోర్షే వంటి హై ఎండ్ లగ్జరీ కార్లు దొరకడంతో ఐటీ అధికారులు షాక్ అయ్యారు. ఈ లగ్జరీ కార్ల విలువ రూ.60 కోట్లు ఉంటుందని అధికారులు తేల్చారు. అంతే కాకుండా రూ.4.5 కోట్ల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. పన్ను ఎగవేత ఆరోపణలతో కాన్పూర్‌కు చెందిన పొగాకు సంస్థ బంశీదర్ గ్రూప్‌పై ఇన్‌కం ట్యాక్స్ అధికారులు నిర్వహించిన సోదాల్లో విస్తుపోయే డబ్బు, కార్లు, ఇతర పత్రాలు సీజ్ చేశారు.
కంపెనీ ఆదాయానికి వారు చూపించే లెక్కలకు పొంతన లేకపోవడంతో అధికారులు తనిఖీలు నిర్వహించి అక్రమాలను బయటపెట్టారు. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్ సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. బంశీదర్ గ్రూప్ అధినేత కుమారుడు శివమ్ మిశ్రాకు చెందిన ఢిల్లీలోని వసంత్ విహార్‌లో ఉన్న ఇంట్లో అధికారులు దాడులు చేశారు. ఈ క్రమంలోనే వారికి టాప్ కంపెనీలకు చెందిన లగ్జరీ కార్లు స్వాధీనం చేసుకున్నారు.
వీటితోపాటు రూ.4.5 కోట్ల డబ్బు, ఇతర పత్రాలు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం కుంభకోణం వెనుక ఉన్న మాస్టర్ మైండ్ బంశీదర్ గ్రూప్ అధినేత కేకే మిశ్రా అని ఐటీ అధికారులు పేర్కొంటున్నారు. ఈ కంపెనీ భారీ ఎత్తున టాక్స్‌లు, జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు.
అయితే బంశీదర్ గ్రూప్ తమ వార్షిక టర్నోవర్ రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్లు అన ప్రకటించగా అది చాలా ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి బంశీదర్ గ్రూప్ వార్షిక టర్నోవర్ రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్లమేర ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దేశంలో పొగాకు సరఫరా చేసే అతిపెద్ద సంస్థల్లో ఈ బంశీధర్ గ్రూప్ కూడా ఒకటి. పాన్‌మసాలా సంస్థలకు ఈ బంశీదర్ గ్రూప్ సరుకు రవాణా చేస్తుంది. ఇక ఈ సోదాల్లో 15 నుంచి 20 ఐటీ బృందాలు పాల్గొన్నట్లు తెలుస్తోంది.