తమిళనాడులో బీజేపీ, డీఎంకే మధ్య మాటల తూటాలు పేలుతునే ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు తమిళనాడులో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించగా.. ఆ పర్యటన సందర్భంగా మరోసారి ఈ రెండు పార్టీల మధ్య వివాదం తలెత్తింది. డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ శుక్రవారం తన 72 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా.. బీజేపీ తమిళనాడు విభాగం జన్మదిన శుభాకాంక్షలు వెల్లడించింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఆ బర్త్ డే విషెస్.. చైనా భాషలో చెప్పడమే అసలు వివాదానికి కారణం అయింది. దీనిపై డీఎంకే నేతలు మండిపడుతున్నారు.
తమిళనాడు ముఖ్మయంత్రి ఎంకే స్టాలిన్ పుట్టిన రోజు సందర్భంగా చైనా భాష మాండరీన్‌లో బీజేపీ శుభాకాంక్షలు తెలిపింది. "గౌరవనీయులైన ముఖ్యమంత్రి తిరు ఎంకే స్టాలిన్‌కు తమిళనాడు బీజేపీ తరఫున ఆయనకు ఇష్టమైన భాషలో పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు కలకాలం సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం" అని పేర్కొంది. ఈ మేరకు బీజేపీ తమిళనాడు శాఖ పోస్ట్ చేయడం పెను దుమారానికి కారణం అయింది. ఈ క్రమంలోనే తమిళనాడులో బీజేపీ, డీఎంకే నేతల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ఇటీవల తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్టణంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రోకు చెందిన రెండో రాకెట్ లాంచ్ ప్యాడ్‌ను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే స్పేస్ పోర్టుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం టీవీలు, పేపర్లలో ఇచ్చిన ప్రకటనల్లో ఒక భారీ తప్పిదం జరిగింది. తమిళనాడు పశుసంవర్ధక శాఖ మంత్రి అనిత రాధాకృష్ణన్ ఇచ్చిన ప్రకటనల్లో ఇస్రో రాకెట్‌కు చైనా జెండా రంగులు ఉండటం పెను దుమారానికి కారణం అయింది. తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన ఆ ప్రకటనపై తమిళనాడు బీజేపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టాలిన్ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ వివాదంపై తీవ్రంగా మండిపడ్డారు.
అయితే ఈ వివాదాన్ని ముగించేందుకు డీఎంకే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇస్రో రాకెట్‌కు చైనా జెండా రంగు ఉండటం డిజైనర్ పొరపాటు అని మంత్రి అనిత రాధాకృష్ణన్ కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బీజేపీ నేతలు వెనక్కి తగ్గకుండా డీఎంకేపై, తమిళనాడు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో స్టాలిన్ పుట్టినరోజు సందర్భంగా.. ఆ విషయాన్ని గుర్తు చేసిన బీజేపీ.. స్టాలిన్‌కు ఇష్టమైన చైనా భాషలో శుభాకాంక్షలు చెప్తున్నట్లు సెటైరికల్ ట్వీట్ చేసింది.