భారత్ మాల్దీవుల మధ్య ఇటీవలె దౌత్య పరంగా తీవ్ర వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలోనే మాల్దీవుల్లో ఉన్న భారత సైన్యం వెనక్కి వెళ్లిపోవాలని ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూ ఆదేశాలు ఇవ్వడం, లక్షద్వీప్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై మాల్దీవులు మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రెండు దేశాల మధ్య సత్సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లక్షద్వీప్‌లో మాల్దీవులకు పక్కనే సరికొత్త భారత నౌకా దళ బేస్‌ను ఏర్పాటు చేసింది. దీన్ని వచ్చే వారం ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ కొత్త నేవీ బేస్ ద్వారా హిందూ మహాసముద్రంలో మరింత ఎక్కువ గస్తీ చేపట్టవచ్చని భారత నౌకా దళం భావిస్తోంది.
సరికొత్త నౌకాదళ స్థావరానికి ఐఎన్‌ఎస్ జటాయుగా పేరు పెట్టారు. ఈ ఐఎన్ఎస్ జటాయితో హిందూ మహా సముద్రంపై భారత్‌కు మరింత నిఘా పెరిగే అవకాశం ఉంది. లక్షద్వీప్‌లోని మినికాయ్ ద్వీపంపై ఏర్పాటు చేసిన ఈ స్థావరంలో తొలుత తక్కువ మంది అధికారులు, సిబ్బందిని మోహరించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత భవిష్యత్తులో ఈ ఐఎన్ఎస్ జటాయును అతిపెద్ద నౌకాదళ స్థావరాల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తామని తెలిపాయి. ఇక వచ్చే వారం విమాన వాహక నౌకలైన ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య, ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై కమాండర్స్ కాన్ఫరెన్స్ ప్లాన్ జరగనుంది. ఈ రెండు భారీ యుద్ధ నౌకలు కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఈ సందర్భం లోనే ఐఎన్ఎస్ జటాయును కూడా ప్రారంభించాలని ఇండియన్ నేవీ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తూర్పున అండమాన్-నికోబార్ ద్వీపాల్లో ఉన్న ఐఎన్‌ఎస్ బాజ్ స్థావరం మాదిరిగా.. పశ్చిమంలో ఐఎన్ఎస్ జటాయు సేవలు అందించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఐఎన్‌ఎస్ జటాయు మాల్దీవుల్లోని ద్వీపాలకు దాదాపు 50 మైళ్ల దూరంలో ఉంటుంది. హిందూ మహా సముద్రంలో సైనిక, వాణిజ్య నౌకల కదలికలను పరిశీలించేందుకు ఈ ఐఎన్ఎస్ జటాయు భారత్‌కు కీలకంగా మారనుంది. మరోవైపు వచ్చేవారం ఎంహెచ్-60 హెలికాప్టర్లు కూడా నౌకా దళంలోకి చేరనున్నాయి. గోవాలో నిర్మించిన నౌకాదళ కళాశాలను కూడా ఈ సందర్భంగా ప్రారంభించే అవకాశం ఉంది.
ఐఎన్ఎస్ జటాయు నౌకాదళ స్థావరానికి అతి సమీపంలోనే ఐఎన్‌ఎస్ విక్రాంత్, ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యను భారత నౌకా దళం మోహరించి ఉంచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం జరగనున్న కమాండర్స్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఇండియన్ నేవీకి చెందిన యుద్ధ విమానాలు ఒక ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌పై నుంచి టేకాఫ్ అయి.. మరో దానిపై ల్యాండింగ్ కావడం వంటి ఆపరేషన్లను నిర్వహించనున్నారు. జలాంతర్గాములు, మరికొన్ని యుద్ధ నౌకలు కూడా ఈ సందర్భంగా క్యారియర్ గ్రూప్ కార్యకలాపాల్లో పాలుపంచుకోనున్నాయి.