రాజధానిలో భూమిలేని పేదలకు మరో పదేళ్లు పెన్షన్ల కాలపరిమితిని పొడిగించాలని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బకాయిలతో సహా పెంచిన పెన్షన్ చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ‘‘రాజధాని అమరావతిలో భూమిలేని పేదల పెన్షన్‌ను వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల నుంచి నయా పైసా పెంచలేదు. తాజాగా రూ.2,500 నుంచి రూ.5వేలకు పెంచుతూ జీవో జారీ చేసింది. ఎన్నికలకు ముందు అధికారం లోకి రాగానే పెన్షన్ రూ.5వేలకు పెంచుతామని జగన్ హమీ ఇచ్చారు. ఆ మేరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పెన్షన్ పెంపును వర్తింపజేయాలి. ఆ బకాయిలు చెల్లించి ముఖ్యమంత్రి తన చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలి. రాజధాని భూ సమీకరణ చట్టం ప్రకారం పదేళ్లు మాత్రమే పేదలకు పెన్షన్ సౌకర్యం ఉంది. మరో 10నెలల్లో ఈ కాల పరిమితి పూర్తవుతోంది. రాజధాని నిర్మాణం నిలిచిపోయింది. అక్కడి పేదలకు వ్యవసాయ పనులు లేక, రాజధాని నిర్మాణ పనులు, ఇతర పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. భూమిలేని పేదలకు ఇచ్చే పెన్ష్‌న్ మరో పదేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం తక్షణమే ఆదేశాలు ఇవ్వాలి.’’ అని బాబూరావు పేర్కొన్నారు. అశ, అంగన్వాడీ, సీఆర్డీయే, పారిశుధ్య కార్మికులు, సచివాలయం, హైకోర్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి రద్దు చేసిన రాజధాని పేదల పెన్షన్‌ను పునరుద్ధరించి వారికి బకాయిలతో సహా చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.