నెల్లూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతి రెడ్డి దంపతులు టీడీపీలో చేరారు. ఆయనతో పాటు నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్, పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. పీవీఆర్ కన్వెన్షన్‌లో నిర్వహించిన చేరికల సభకు కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చి నేతలకు పసుపు కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. టీడీపీలో చేరడం ఎంతో ఆనందంగా ఉందన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నానని.. నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, ఇతర వైఎస్సార్‌సీపీ నేతలను టీడీపీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను అన్నారు చంద్రబాబు.
ప్రజాసేవకు మారుపేరు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అని.. యుద్ధానికి సై అంటూ అంతా ముందుకొస్తున్నారని తెలిపారు. ప్రశ్నించిన వారిని వేధించడమే జగన్ పని. అహంకారంతో ఆయన రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని.. రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసిన వ్యక్తిని ఇంటికి పంపాలన్నారు. జగన్ విధానాలు నచ్చక నేతలు తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారని.. ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల కోసం అందరూ ఆలోచించాలన్నారు.
నెల్లూరు జిల్లాలో కలిసికట్టుగా ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవాలన్నారు. రాజకీయాలకు గౌరవం తెచ్చే వ్యక్తి వేమిరెడ్డి రాకతో నెల్లూరు జిల్లాలో టీడీపీ గెలుపు ఖాయమైందన్నారు. సాధరణంగా మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చేరికల కార్యక్రమం ఉంటుందని.. కానీ వేమిరెడ్డి వంటి నేత కోసం ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు వచ్చి పార్టీలోకి స్వాగతం పలికినట్లు తెలిపారు. నెల్లూరు పార్లమెంటు స్థానం ఇక ఇక టీడీపీకే అన్నారు. యుద్ధానికి సై అంటూ అందరూ ముందుకు వస్తున్నారన్నారని.. న్యాయం కోసం పోరాడిన సమర్థ నాయకుడు వేమిరెడ్డి అని కొనియాడారు. రాజకీయాలకు గౌరవం తెచ్చే నేతలను ఎప్పుడూ స్వాగతిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో అందరిని వేధించడమే పనిగా పెట్టుకున్నారని.. నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలను కూడా వేధించారని.. నియోజకవర్గాలకు కనీసం నిధులు కేటాయించలేదన్నారు. జగన్ ఒక్కరే రాజు అనుకుంటుకున్నారని.. అందరూ బానిసలా అని ప్రశ్నించారు. రాష్ట్రం కోసం, భావి తరాల కోసం జగన్‌ను గద్దె దించాలన్నారు. నెల్లూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ మొత్తం ఖాళీ అవుతోందన్నారు. రాష్ట్రం అంటే మట్టి కాదు.. మనుషులు అన్నారు. వైనాట్ 175 కాదు.. వైనాట్ పులివెందుల అంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ పాలనలో సాధారణ ప్రజలకు కష్టాలు తప్పడం లేదని.. లారీ ఓనర్ కాస్త ఇప్పుడు డ్రైవర్ అయ్యాడన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కూడా కష్టాలు పడుతున్నారని.. జీతం వస్తే చాలు అనుకునే పరిస్థితికి తెచ్చారన్నారు.