తిరుమల శ్రీవారి దర్శనం కోసం సమ్మర్‌లో తిరుమలకు వెళ్లే భక్తులను టీటీడీ అలర్ట్ చేసింది. తిరుమలలో రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో.. వేసవి కాలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఏప్రిల్ నుంచి జులై వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందువల్ల సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ విఐపి బ్రేక్, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్ సేవలు, రూ.300 దర్శన టికెట్లు తగ్గించామన్నారు.
తిరుమలలో దాదాపు 7500 గదులు ఉన్నాయని.. వీటిలో 45 వేల మందికి సరిపడా వసతి అందుబాటులో ఉందన్నారు. దాదాపు 85 శాతం గదులు సామాన్య భక్తుల కోసమే కేటాయిస్తున్నామని.. వేసవిలో తిరుమలకు తరలివచ్చే వేలాది మంది భక్తులకు అవసరమైనంత వసతి సౌకర్యం లేనందున భక్తులు తిరుపతిలో వసతి పొందాలని టీటీడీ కోరింది.
సూర్యప్రభ వాహనంపై శ్రీకపిలేశ్వరస్వామివారి కటాక్షం
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన శనివారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామివారు సూర్యప్రభ వాహనంపై కటాక్షించారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.
చీకటిని ఛేదించి లోకానికి వెలుగు ప్రసాదించేవాడు సూర్యుడు. సూర్యుని ప్రభ లోకబంధువైన కోటిసూర్యప్రభామూర్తి శివదేవునికి వాహనమైంది. మయామోహాందకారాన్ని తొలగించే సోమస్కందమూర్తి, భక్తులకు సంసారతాపాన్ని తొలగిస్తున్నారు. అనంతరం స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. శ్రీ స్కోమస్కందమూర్తి, శ్రీకామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్ర బాబు, ఏఈవో సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్ పెక్టర్లు రవికుమార్, బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.
సింహ వాహనంపై యోగనరసింహుడి అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శనివారం ఉదయం 8 గంటలకు అనంతతేజోమూర్తి అయిన శ్రీనివాసుడు యోగనరసింహుడి అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహనం ముందు వృషభాలు, గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. కాగా, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు కటాక్షిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్, సూపరింటెండెంట్ వెంకటస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.