కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమలలో అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనాల కోసం భక్తులు వెళ్లే మార్గంలో ఉన్న సివిల్ ఇంజినీరింగ్ స్టోరేజ్ గదిలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో సమీపంలోని భక్తులు కంగారుపడ్డారు. దట్టమైన పొగ వ్యాపించడంతో ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత మంటలు చెలరేగిన విషయాన్ని టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని చేరవేశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. దీంతో భక్తులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అయితే సివిల్ ఇంజినీరింగ్ స్టోరేజీ గదిలో మంటలు ఎలా చెలరేగాయనేది తెలియడం లేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగసిపడ్డాయా లేదా ఎవరైనా దురుద్దే్శపూర్వకంగా మంటలు అంటించారా అనే దానిపై క్లారిటీ లేదు. అధికారులు కూడా ఈ విషయమై దర్యాప్తు జరుపుతున్నారు.మరోవైపు ఇటీవల కూడా తిరుమలలో ఓ ప్రమాదం తప్పింది. ఫిబ్రవరి 21న.. ఎస్వీ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఉన్న గేటును ఓ ట్రాక్టర్ వేగంగా వచ్చి ఢీకొంది. డ్రైవర్ బ్రేక్ కు బదులుగా యాక్సిలరేటర్‌పై కాలు వేయటంతో ట్రాక్టర్ గేటును బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో గేట్ వద్ద భక్తులు ఎక్కువ మంది లేకపోవటంతో ప్రమాదం తప్పింది . ముగ్గురికి గాయాలయ్యాయి.
మరోవైపు తిరుమల శ్రీవారిని శనివారం 70 ,442 మంది భక్తులు దర్శించుకున్నారు. 30, 867 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శనివారం ఒక్కరోజే హుండీ కానుకల ద్వారా 3.60 కోట్ల ఆదాయం సమకూరింది. భక్తుల సంఖ్య అధికంగా ఉండటంతో సర్వదర్శనం కోసం 12 గంటల సమయం పడుతోంది.