ఉత్తరాంధ్రవాసులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ -పలాస- విశాఖ (08532/08531) ప్రత్యేక పాసింజర్ రైలును బ్రహ్మపుర వరకు పొడిగించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. విశాఖ -బ్రహ్మపుర (08532) పాసింజర్ రైలు ఈనెల 3 నుంచి ప్రతి రోజు సాయంత్రం 5.45గంటలకు విశాఖ నుంచి బయలుదేరి రాత్రి 11.10గంటలకు బ్రహ్మపుర చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో బ్రహ్మపుర- విశాఖ (08531) పాసింజర్ ఈనెల 4వ తేదీ నుంచి ప్రతిరోజు తెల్లవారుజామున 3.30గంటలకు బ్రహ్మపురలో బయలుదేరి ఉదయం 9.20గంటలకు విశాఖ చేరుకుంటుందన్నారు. ఈ రైలు 14 జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు, 2 సెకండ్ క్లాస్ దివ్యాంగజన్ బోగీలతో నడుస్తుందన్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి విశాఖ వెళ్లి వచ్చేందుకు వీలుగా పాసింజర్ రైలు లేకపోవడంతో జనాలు ఇబ్బందిపడుతున్నారు. అలాగే కిడ్నీ బాధితులు వేకువజామున బస్సుల్లో వెళ్లేందుకు ఆర్థికంగా భారంగా మారింది. అందుకే పలాస పాసింజర్ రైలును ఈ నెల 3 నుంచి బ్రహ్మపుర వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్యాసింజర్ రైలును బ్రహ్మపుర వరకు పొడిగించేందుకు తనవంతుగా కృషిచేసిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడుతో పాటుగా రైల్వే అధికారులకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు.