నేరస్థులు రోజు రోజుకూ చెలరేగిపోతున్నారు. ఒంటరి మహిళలు, వృద్ధులు లక్ష్యంగా దాడులకు, చోరీలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా.. శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని మంచానికి కట్టేసి.. బంగారాన్ని దోచుకెళ్లిన ఘటన శ్రీకాకుళంలో కలకలం రేపింది. వృద్ధురాలు ఒంటరిగా ఉండటం గమనించిన దుండగులు.. ఆమెను బంధించి ఒంటిపై ఉన్న 30 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం సరంగడోల వీధిలో బమ్మిడిపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి తన తల్లి జగదాంబతో కలిసి నివశిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న శ్రీనివాసరావు ఎప్పటిలాగానే శనివారం కూడా డ్యూటీకని ఉదయమే బయల్దేరి వెళ్లారు. దీంతో జగదాంబ ఒంటరిగా ఇంట్లో ఉన్నారు. జగదాంబ ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన ఇద్దరు దుండగులు.. ఉదయం 11 గంటల సమయంలో ఇంట్లోకి ప్రవేశించారు. ఆగంతకులను చూసిన జగదాంబ గట్టిగా కేకలు వేయబోయింది. దీన్ని గమనించిన దుండగులు.. ఆమె నోట్లో గుడ్డలు కుక్కి.. చేతులను మంచానికి కట్టేశారు.
ఆ తర్వాత వృద్ధురాలిని చంపేస్తామని బెదిరించి ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకున్నారు. 16 బంగారు గాజులు, 3 గొలుసులను బలవంతంగా తెంచుకుని పారిపోయారు. అయితే గంటన్నర తర్వాత కట్లు విడిపించుకున్న జగదాంబ.. గట్టిగా కేకలు వేశారు. దీంతో ఇరుగుపొరుగు వారు అక్కడకు చేరుకుని జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. ఆ తర్వాత పోలీసులను సమాచారం అందించారు. స్థానికుల ఫిర్యాదుతో ఏఎస్పీ ప్రేమ్‌కాజల్, డీఎస్పీ శ్రుతి, సీఐ సన్యాసినాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొత్తం 30 తులాల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లినట్లు బాధితులు చెప్తున్నారు.