రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయాన్ని రూ.370 కోట్లకు తాకట్టు పెట్టారన్న వార్తలపై ఆయన పై విధంగా స్పందించారు. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ భవనాలు తాకట్టు పెట్టేశారు... ఇప్పుడు ఏకంగా రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టు పెట్టడం ఏంటి జగన్ మోహన్ రెడ్డి గారూ? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అప్పుల ఊబిలో మునిగిపోయిన శ్రీలంక కూడా తమ పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టలేదని, కానీ ఇది ఒక్క జగనన్నకు మాత్రమే సాధ్యమని మరోసారి నిరూపించారు అంటూ గంటా వ్యంగ్యం ప్రదర్శించారు. ప్రజలు మరోసారి గెలిపిస్తే శ్రీహరికోట, సాగర్ డ్యామ్, శ్రీశైలం డ్యామ్, పోలవరం డ్యామ్ కూడా తాకట్టు పెట్టేస్తారేమో అని సందేహం వెలిబుచ్చారు.
"మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాటకు తెరలేపారు. చివరికి ఉన్న ఒక్క రాజధానిలో రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశారు. నిన్న విశాఖలో 13 ప్రభుత్వ ఆస్తులు, భవనాలు, కాలేజీలు తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్ల అప్పులు తెచ్చారు. మద్యం తాకట్టు పెట్టి రూ.48 వేల కోట్ల అప్పు తెచ్చారు. ఆర్ అండ్ బీ ఆస్తులు తాకట్టు పెట్టి రూ.7 వేల కోట్ల అప్పు తెచ్చారు... కానీ ఇప్పటిదాకా రోడ్లు వేయలేదు. టిడ్కో ఇళ్లు తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు తెచ్చారు కానీ ఇప్పటివరకు ఆ టిడ్కో ఇళ్లు పూర్తి చేయలేదు. చెత్త పన్నుతో సహా పలు రకాల పన్నులతో రూ.లక్షల కోట్ల మేర బాదారు. ఒక్కో కుటుంబంపై రూ.8 లక్షల భారం మోపారు. ఇప్పుడు మరో రూ.370 కోట్ల అప్పు కోసం రాష్ట్ర సచివాలయ సముదాయాన్ని హెచ్ డీఎఫ్ సీ బ్యాంకుకు తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రతిష్ఠను మంటగలిపారు.
ఈ 58 నెలల కాలంలో రూ.12 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. సంక్షేమ పథకాలకు రూ.2 లక్షల కోట్లు పోగా, మిగిలిన లక్షల కోట్లు ఏమయ్యాయి? రేపు మన ప్రైవేటు ఆస్తులను, భూములను కూడా తాకట్టు పెట్టి లక్షల కోట్లు అప్పు తెచ్చుకుని లూటీ చేసే ప్రమాదం కూడా ఉంది. రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. రాష్ట్రాన్ని తాకట్టాంధ్రప్రదేశ్ గా మార్చిన ఈ అరాచక ప్రభుత్వాన్ని ఓటు అనే ఆయుధంతో తరిమికొట్టాలి" అని గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.