టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటికి ఆ పార్టీ నేతలు క్యూ కట్టారు. ఒకట్రెండు రోజుల్లో టీడీపీ నుంచి రెండో లిస్టు వస్తుందనే అంచనాల మధ్య టికెట్ కోసం ప్రయత్నిస్తున్న ఆశావహులు అధినేత ప్రసన్నం కోసం ఇంటికి వరుస కట్టారు. ఇప్పటికే టీడీపీ, జనసేన నుంచి ఉమ్మృడిగా తొలి జాబితా విడుదలైంది. 99 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించగా.. ఇందులో టీడీపీ నుంచి 94, జనసేన నుంచి ఐదుగురు ఉన్నారు. మరో 19 స్థానాలను జనసేనకు కేటాయించగా .. పవన్ కళ్యాణ్ పేర్లు ప్రకటించాల్సి ఉంది. అయితే రెండో జాబితాలో టీడీపీ నుంచి 25 నుంచి 30 మంది అభ్యర్థులను, జనసేన నుంచి పదిపేర్లను ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది.
రెండో లిస్టుకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇప్పటికే చర్చలు జరిపారు. త్వరలోనే వీరిద్దరూ ఢిల్లీకి వెళ్తారని తెలుస్తోంది. అయితే ఢిల్లీకి వెళ్లే లోపలే రెండో లిస్టు ప్రకటిస్తారా లేదా హస్తినకు వెళ్లి వచ్చిన తర్వాత రెండో జాబితా ప్రకటన ఉంటుందా అనే విషయమై క్లారిటీ లేదు. కానీ తొలి జాబితాలో చోటు దక్కని నేతలు, ఈసారి ఎన్నికల్లో పోటీచేయాలని భావిస్తున్న నేతలు టీడీపీ అధినేత ఇంటికి క్యూ కట్టారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గౌతు శ్యామ్‌సుందర్ శివాజీ చంద్రబాబును కలిశారు. అలాగే కళా వెంకట్రావు, గుమ్మనూరు జయరాం చంద్రబాబుతో భేటీ అయ్యారు. అదే విధంగా ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో కలిసి పెందుర్తి నేత బండారు అప్పలనాయుడు చంద్రబాబును కలిశారు.
మరోవైపు సర్వేపల్లి స్థానం నుంచి పోటీ చేయాలని సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన టికెట్ వ్యవహారమై చంద్రబాబుతో చర్చించేందుకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. అలాగే పెందుర్తి స్థానం నుంచి బరిలో నిలవాలని బండారు సత్యనారాయణమూర్తి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బండారు అప్పలనాయుడు.. టీడీపీ అధినేతతో చర్చించినట్లు సమాచారం. అలాగే పలాస టికెట్‌ను గౌతు శిరీష ఆశిస్తున్నారు. దీనిపై అధినేతతో మాట్లాడేందుకు గౌతు శ్యాంసుందర్ శివాజీ చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఇదే సమయంలో జనసేనతో పొత్తులో ఉండటంతో ఆయా స్థానాలపై క్లారిటీ కోసం భేటీ అయినట్లు సమాచారం.
ఇక మంగళవారమే టీడీపీలో చేరిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం సైతం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయన అనంతపురం జిల్లాలోని గుంతకల్లు స్థానం నుంచి బరిలో దిగాలని భావిస్తున్నారు. అయితే గుంతకల్లు టీడీపీ నేతలు మరీ ముఖ్యంగా జితేంద్రగౌడ్ వర్గం అందుకు అభ్యంతరం తెలుపుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన చంద్రబాబుతో భేటీ అయినట్లు తెలుస్తోంది.