దశాబ్దాల కల నెరవేరింది. మూడు జిల్లాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో శంకుస్థాపన చేసిన పూల వెంకటసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును సీఎం జగన్ ప్రారంభించారు. ప్రాజెక్టులోభాగంగా నిర్మించిన రెండు టన్నెళ్లను వైఎస్ జగన్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం సభలో మాట్లాడిన వైఎస్ జగన్.. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును ఆయన కొడుకుగా తాను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటూ వ్యాఖ్యానించారు.
"ఎన్నో దశాబ్దాలుగా కలలుగన్న మన స్వప్నాన్ని మన కళ్ల ఎదుటే ఈరోజు పూర్తైంది. ఆ టన్నెల్‌లో ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది.దేవుడు ఇంతటి అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు దేవుడికి సదా రుణపడి ఉంటాను. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను, వారి దాహార్తిని తీర్చడమే కాకుండా.. సాగునీరు కూడా అందించే గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు, దివంగత నేత రాజశేఖరరెడ్డి గారు శంకుస్థాపన చేసి మొదలు పెడితే.. ఈరోజు ఆయన కొడుకుగా రెండు టన్నెళ్లను జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది" అని జగన్ అభిప్రాయపడ్డారు.
వెలిగొండ ప్రాజెక్టును 2004లో జలయజ్ఞంలో భాగంగా వైఎస్ఆర్ శంకుస్థాపన చేశారు.2005 అక్టోబరులో శిలాఫలకం వేసి పనులు ప్రారంభించారు. సహజ సిద్ధంగా ఏర్పడిన కొండల నడుమ ఉన్న సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల వద్ద మూడు వాటర్ స్టోరేజ్ పాయింట్ల వద్ద కాంక్రీట్ డ్యాముల నిర్మాణం చేశారు. శ్రీశైలంలోని కృష్ణా జలాలను తరలించేందుకు నల్లమల భూగర్భంలో దోర్నాల మండలం కొత్తూరు నుంచి కొల్లంవాగు వరకు 18 కి.మీ మేర రెండు సొరంగాలను తవ్వాలని నిర్ణయించారు. అందులో మొదటి సొరంగం నిర్మాణాన్ని 2021 జనవరి 13న పూర్తిచేస్తే, రెండో సొరంగం పనులు ఇటీవలే పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం జిల్లాలోని 23 మండలాలు, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలు, కడప జిల్లాలోని 2 మండలాలు కలిపి 30 మండలాల్లోని 15.25 లక్షల మందికి తాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.
మరోవైపు వచ్చే ఖరీఫ్‌లో శ్రీశైలం నుంచి నల్లమల సాగర్‌కు నీళ్లు తీసుకొచ్చి, నల్లమల సాగర్‌ను నింపనున్నారు. శ్రీశైలంలో 840 అడుగులు దాటిన వెంటనే.. రోజుకో టీఎంసీ నీటిని ఈ రెండు సొరంగాల ద్వారా నల్లమల సాగర్‌కు తరలించనున్నారు. ఇక దాదాపు 3 వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న మొదటి టన్నెల్, 8,500 క్యూసెక్కుల కెపాసిటీతో రెండో టన్నెల్ పూర్తయిందన్న సీఎం జగన్.. ఈ జూలై- ఆగస్టులో నీళ్లు నింపే సమయానికి.. మరో 1200 కోట్లు ఖర్చు చేసి ఎల్ఏ, ఆర్అండ్‌ఆర్ పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన మూడు నెలల్లోనే ఈ పని పూర్తిచేసి నీళ్లు నింపుతామని ప్రకటించారు.
ఈ ప్రాజెక్టు వల్ల ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకన్నింటికీ మంచి జరుగుతుందని తెలిసినా, టన్నెళ్లు పూర్తి చేయడంలో చంద్రబాబు హయాంలో నత్తనడకన పనులు జరిగాయని జగన్ విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టులోని రెండు టన్నెళ్లు.. ఒక్కొక్కటీ 18.8 కి.మీ. పొడవు ఉన్నాయి.ఇందులో 2004 నుంచి 2014 వరకు దాదాపు 20 కి.మీ. నిర్మాణం పూర్తయ్యాయి. ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకూ 6.6 కి.మీ. నిర్మాణం జరిగింది. మిగిలిన 11 కి.మీ. టన్నెళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసిన జగన్ ప్రభుత్వం.. బుధవారం జాతికి అంకితం చేసింది.