అన్నవరం ఆలయానికి కేంద్ర ప్రభుత్వ పథకం ‘ప్రసాద్’ నిధులు రూ.20.06 కోట్లను కేటాయించింది. ఈ మేరకు అన్నవరం దేవస్థానంలో చేపట్టే వివిధ అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. శ్రీనగర్ బక్షీ స్టేడియం వేదిక నుంచి దేశవ్యాప్తంగా ప్రసాద్ పథకం పనులను ప్రధాని ప్రారంభించారు. అన్నవరం ఆలయ ప్రాంగణంలో స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కాకినాడ ఎంపీ వంగా గీత, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్‌లు దేవస్థానం ఛైర్మన్ ఐవీ రోహిత్, ధర్మకర్తల మండలి సభ్యులు, ఇతరులు కలిసి ప్రసాద్ పనుల శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
కేంద్ర నిధులతో అధునాతన వసతులతో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. క్యూకాంప్లెక్స్ (గ్రౌండ్, ఫస్ట్‌ఫ్లోరు) 22 వేల చదరపు అడుగుల్లో సుమారు 1500 మంది భక్తులు వేచి ఉండేందుకు వీలుగా రూ.5.95 కోట్లతో నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు. దుస్తులు మార్చుకునే గదులు, టాయిలెట్లు (1660 చదరపు అడుగుల్లో) రూ. 61.85 లక్షలతో నిర్మించడానికి అంచనా వేశారు. రూ.56.64 లక్షలతో 8 సీట్ల సామర్థ్యంగల 4 ఎలక్ట్రికల్ వ్యాన్లు, రూ.45.92 లక్షలతో రెండు ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే నిత్యాన్నదాన భవనం (గ్రౌండు, ఫస్ట్‌ఫ్లోరు) 50 వేల చదరపు అడుగుల్లో ఒకేసారి 1,600 మంది భక్తులు భోజనం చేసే విధంగా రూ. 11.50 కోట్లతో నిర్మాణం చేయనున్నారు.