మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పంచారామ క్షేత్రాలలో ఒక్కటైన కాకినాడ జిల్లా సామర్లకోటలోని ద్రాక్షారామంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాల త్రిపుర సుందరి సమేత శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం.. మాఘమాసం నాగ చతుర్దశి రోజున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్త శోభను సంతరించుంది. శుక్రవారం (మార్చి 8) ఉదయం నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు. కోనేరులో స్నానం ఆచరించి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి స్వామి వారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. అటు కోటిపల్లిలోని ఛాయా సోమేశ్వరస్వామి ఆలయం సైతం శివనామస్మరణతో మారుమోగింది. తెల్లవారుజామున 4 గంటల నుంచే సప్త గోదావరి నదిలో భక్తులు స్నానమాచరించి స్వామి వారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోటిపల్లి రేవు వద్ద కొంత మంది భక్తులు పితృదేవతలకు పిండ ప్రదానాలు చేశారు.