తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు ముఖ్యగమనిక. మార్చి నెలలో ఐదు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేశారు. తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలను మార్చి 20 నుండి 24వ తేదీ వరకు నిర్వహించనున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో తెప్పోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. తెప్పోత్సవాల్లో తొలిరోజు(మార్చి 20న) శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు. రెండోరోజైన మార్చి 21న రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి తెప్పలపై విహరించనున్నారు.
తెప్పోత్సవాల్లో భాగంగా మూడోరోజు శ్రీభూసమేతంగా మలయప్పస్వామి మూడుసార్లు పుష్కరిణిలో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. నాలుగో రోజు మలయప్పస్వామి ఐదుసార్లు, చివరిరోజు ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.మరోవైపు తెప్పోత్సవాల కారణంగా మార్చి 20, 21వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 22, 23, 24వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. మార్చి నెలలో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు ఈ విషయాలను గమనిస్తే మంచిది.
మరోవైపు తిరుమల కొండకు భక్తుల రద్దీ శుక్రవారం సాధారణంగా ఉంది. భక్తులు 15 కంపార్టుమెంట్లలో దర్శనం కోసం వేచి ఉన్నారు. మొత్తం 63,831 భక్తులు శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్నారు. 25,367 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ద్వారా 3.36 కోట్ల ఆదాయం వచ్చింది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులకు దర్శనానికి 18 గంటల సమయం పట్టింది.