నెల్లూరు జిల్లాలో జరిగిన ఓ ఘటన అందరి హృదయాలను కదిలిస్తోంది. ఎన్నో ఆశలు, కోరికలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది ఆ ప్రేమ జంట. తమ నూరేళ్ల ప్రయాణం సాఫీగా సాగిపోవాలని కోరుకుంటూ ఇటీవలే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. అయితే విధి చిన్న చూపు చూడటంతో ఊహించని రీతిలో నెలరోజుల లోపే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. కానీ తమ కళ్ల ద్వారా మరొకరికి వెలుగులు పంచారు. ఆ వెలుగుల వెలుతురులోనే తమ ప్రేమను చాటుకున్నారు.
నవాబుపేటకు చెందిన కొప్పోలు ప్రశాంత్ అనే యువకుడు ప్రైవేట్ సంస్థలో పనిచేసేవారు.నెల్లూరు రామకోటయ్యనగర్‌కు చెందిన మన్నా పుష్ప అనే యువతిని ప్రేమించాడు ప్రశాంత్. వీరిద్దరూ ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే పుష్ప ఎంబీఏ చదువుతోంది. ఇటీవలే పరీక్షలు ప్రారంభం కాగా.. వెంకటాచలం మండలం కాకుటూరు వద్దనున్న ఓ కాలేజీని పరీక్షా కేంద్రంగా కేటాయించారు. దీంతో పరీక్షల కోసం పుష్పను బైక్ మీద తీసుకెళ్లుండేవాడు ప్రశాంత్. అయితే ఇటీవల పరీక్షల కోసం భార్యాభర్తలు ఇద్దరూ బైక్ మీద వెళ్తుండగా చెముడుగుంట పంచాయతీలోని జిల్లా సైన్స్ కేంద్రం వద్దకు రాగానే.. బైక్‌ను ఆటో ఢీకొంది. బైక్ అదుపు తప్పడంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. ఇంతలోనే వెనుకనే వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు వారి పై నుంచి వెళ్లింది. దీంతో భార్యాభర్తలు ఇద్దరూ అక్కడే చనిపోయారు.
అయితే తమ పిల్లలు చనిపోయినా కూడా వారి ప్రేమ బతికే ఉండాలని వారి కుటుంబసభ్యులు ఆలోచించారు. పుట్టెడు దుఃఖంలోనూ అందరికీ ఆదర్శంగా నిలిచే నిర్ణయం తీసుకున్నారు. నవ దంపతుల నేత్రాలను దానం చేశారు.ప్రభుత్వ ఆస్పత్రి, ఐ బ్యాంక్ సిబ్బంది పుష్ప, ప్రశాంత్ కళ్లను సేకరించి కుటుంబసభ్యులకు నేత్రదాన సర్టిఫికెట్ అందించారు. కుటుంబసభ్యుల నిర్ణయంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ నిర్ణయంతో తమ పిల్లల కళ్లద్వారా మరో కుటుంబంలో వెలుగులు పంచారని అభినందిస్తున్నారు.