2024 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరింది. ఎన్నికల్లో మూడు పార్టీలూ కలిసి పోటీ చేస్తాయని టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ వెల్లడించారు. శనివారం ఉదయం కేంద్ర మంత్రి అమిత్ షా నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్.. అమిత్ షాతో భేటీ అయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు. పొత్తులు, సీట్ల కేటాయింపు, ఏపీలో రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలిసింది. అనంతరం సమావేశం వివరాలను కనకమేడల రవీంద్ర కుమార్ మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని టీడీపీ, జనసేన, బీజేపీ నిర్ణయించాయని అన్నారు. అయితే సీట్ల లెక్కలపై మూడు పార్టీలు కలిసి ప్రకటన విడుదల చేస్తాయని కనకమేడల వివరించారు.
మూడు పార్టీలు కలిసి ఏ పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందనే వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని కనకమేడల వివరించారు. అలాగే పార్టీల బలాబలాలు, గెలుపు ప్రాతిపదికగా మూడు పార్టీలు పొత్తుకు అంగీకరించాయని చెప్పారు. దాని ప్రకారమే సీట్ల షేరింగ్ ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు సీట్ల లెక్కలపైనా మూడు పార్టీల మధ్య ఇప్పటికే ఒక అవగాహన వచ్చింది. టీడీపీ 145 అసెంబ్లీ, 17 ఎంపీ సీట్లలో పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక బీజేపీ, జనసేనకు కలిసి 8 ఎంపీ, 30 ఎమ్మెల్యే సీట్లు ఇస్తారనే ప్రచారం నడుస్తోంది. ఎంపీ సీట్లకు సంబంధించి జనసేనకు రెండు, బీజేపీకి ఆరు లేదా జనసేనకు మూడు, బీజేపీకి ఐదు సీట్లు కేటాయిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి కాకినాడ నుంచి ఎంపీగా పోటీచేస్తారని.. ఆ దిశగా బీజేపీ అధిష్టానం ఆయనకు సూచించినట్లు తెలిసింది. కాకినాడలో జనసేన పార్టీకి బలం ఉండటంతో పాటుగా పవన్ ఎంపీగా పోటీ చేస్తే ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని ఎమ్మెల్యే స్థానాలపైనా ఆ ప్రభావం ఉండే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్‌ను కాకినాడ నుంచి ఎంపీగా బరిలో నిలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పొత్తులో భాగంగా బీజేపీ ఆరు ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. త్వరలో జరిగే ఎన్డీయే భేటీకి టీడీపీ హాజరవుతుందని.. ఆ లోగా సీట్ల కేటాయింపులపైనా క్లారిటీ వస్తుందని మూడు పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు.