ఏపీలో రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్. సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను రాష్ట్రంలోని మరో నాలుగు రైల్వే స్టేషన్లలో ఆపాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆ వివరాలతో ట్వీట్ చేశారు. చాలా కాలంగా ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్‌పై కేంద్ర రైల్వే శాఖ స్పందించింది.. ఇప్పుడు సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని నాలుగు స్టేషన్‌లలో ఈ రైళ్లు ఆగయనున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
రామేశ్వరం - భువనేశ్వర్ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ (20895/20896) రాజమండ్రిలో ఆగుతుంది. హౌరా - పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ రైలు (12867/12868) రాజమండ్రిలో స్టాప్ ఇచ్చారు. అలాగే హుబ్లీ - మైసూరు హంపి ఎక్స్‌ప్రెస్ (16591/16592) అనంతపురంలో ఆగుతుందని రైల్వేశాఖ అధికారులు తెలిపారు. అంతేకాదు సికింద్రాబాద్ - రేపల్లె ఎక్స్‌ప్రెస్ (17645/17646) రైలు సిరిపురంలో ఆగుతుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. రైల్వేశాఖ నిర్ణయంపై ప్రయాణికులకు హర్షం వ్యక్తం చేశారు.
మరోవైపు తెలంగాణలో కూడా పలు రైళ్లకు 14 స్టేషన్లలో అదనపు స్టాపేజీని రైల్వేశాఖ కల్పించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. తనతో పాటూ స్థానికుల రిక్వెస్ట్ మేరకు రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు రైల్వే డివిజన్ల పరిధిలో నడిచే రైళ్లకు తెలంగాణలోని 14 స్టేషన్లలో అదనపు స్టాప్‌లు ఇచ్చారు. వీటిలో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోనే 9 స్టేషన్లు ఉన్నాయి. తిరుపతి-ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్‌ప్రెస్ (17405/17406) మేడ్చల్‌లో.. నర్సాపూర్-నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ (12787, 12788) రైళ్లు మహబూబాబాద్‌లో ఆగుతాయి.
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (20701/20702) మిర్యాలగూడలో, రేపల్లె-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (17646) రామన్నపేటలో, గుంటూరు-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (17253) ఉందానగర్‌లో, తిరుపతి-సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్‌ప్రెస్ (12763) నెక్కొండలో, పుణె-కాజీపేట ఎక్స్‌ప్రెస్ (22151/22152) మంచిర్యాలలో, దౌండ్-నిజామాబాద్ ఎక్స్‌ప్రెస్ (11409/11410) నవీపేటలో, కాజీపేట-బల్లార్ష ఎక్స్‌ప్రెస్ (17035/172036) రాఘవాపురంలో, బల్లార్ష-కాజీపేట ఎక్స్‌ప్రెస్ (17035/172036) మందమర్రిలో, సికింద్రాబాద్-భద్రాచలం రోడ్ కాకతీయ ఎక్స్‌ప్రెస్ (17659/17660)తడికలపూడిలో, భద్రాచలం రోడ్-సికింద్రాబాద్ కాకతీయ ఎక్స్‌ప్రెస్ (17660) బేతంపూడి స్టేషన్‌లో, భద్రాచలంరోడ్-బల్లార్ష సింగరేణి మెము ఎక్స్‌ప్రెస్ (17033,17034) బేతంపూడిలో, కాజీపేట-బల్లార్ష ఎక్స్‌ప్రెస్ (17035) రేచ్ని రోడ్‌లో ఆగుతాయని కిషన్ రెడ్డి తెలిపారు.
మరోవైపు తూర్పు కోస్తా రైల్వే విశాఖ నుంచి మరో వందేభారత్ రైలును నడపడానికి సిద్ధమైంది. ఈ మేరకు భువనేశ్వర్ - విశాఖ - భువనేశ్వర్ (20841 - 20842) రైలును పట్టాలపైకి ఎక్కించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు శుక్రవారం ట్రయల్ రన్ నిర్వహించారు. ఉదయం 5.15 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరిన ఈ రైలు 11 గంటలకు విశాఖ చేరుకొంది. మధ్యాహ్నం 3.45 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి 9.30గంటలకు భువనేశ్వర్ చేరుకుంది. ఈ రైలుకు 8 బోగీలు ఉంటాయి. 443 కిలోమీటర్ల దూరాన్ని 4.45 గంటల్లో చేరుకుంటుంది. ఖుర్ధారోడ్, బ్రహ్మపుర, ఇచ్చాపురం, పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం స్టేషన్లలో హాల్ట్ కల్పించారు. ఈనెల 12 నుంచి పట్టాలపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టికెట్ల ధరలు ఇంకా నిర్ణయించలేదు. విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వందేభారత్ రైలులో ఉండే ఛార్జీలే దీనికి వర్తింపచేస్తారని వాల్తేరు రైల్వే అధికారులు చెప్పారు.