కడపలో సినిమా ఫక్కీలో జరిగిన ఓ కిడ్నాప్ వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది. దుబాయ్ నుంచి తిరిగి వస్తున్న వ్యక్తిని కొంతమంది కిడ్నాప్ చేశారు. పక్కాగా ప్లాన్ చేసి.. దుబాయ్ నుంచి తిరిగి వస్తుండగా మాటువేసి అపహరించారు. ఆటోలో బంధించి తమ వెంట తీసుకెళ్లిపోయారు. అయితే ఊహించని విధంగా వారి ప్లాన్ రివర్సైంది. చివరకు బంధించిన వాడిని వదిలిపెట్టారు. కడప రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కడప టౌన్‌లోని ఖలీల్ నగర్‌కు చెందిన ఇలియాజ్ అనే వ్యక్తి ఉపాధి కోసం కొన్ని రోజుల కిందట దుబాయ్ వలస వెళ్లాడు. అక్కడ సంపాదించిన సొమ్ముతో కొంచెం బంగారం కొనుక్కున్నాడు. సంపాదించిన బంగారంతో సంతోషంగా ఇంటికి వస్తుండగా ఊహించని ఘటన జరిగింది. బంగారం తీసుకుని శనివారం ఉదయం ఐదుగంటల సమయంలో కడపకు చేరుకున్నాడు ఇలియాజ్. అయితే ఇలియాజ్ వస్తున్న సంగతిని ముందుగానే తెలుసుకున్న ఓ గ్యాంగ్.. అతను ఇంటికి వెళ్లే దారిలో మాటు వేసింది. సరిగ్గా టైమ్‌కు ఇలియాజ్ రాగానే దాడి చేసింది. బలవంతంగా ఆటోలో అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.
అలా ఆటోలో తీసుకెళ్లిన గ్యాంగ్.. ఇలియాజ్‌ను కొట్టి అతని వద్ద ఉన్న డబ్బులు, బంగారం లాక్కున్నారు. అయితే స్థానికుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు పోలీసులు సమాచారం అందించారు. దీంతో కడప పోలీసులు రంగంలోకి దిగారు. ఖలీల్ నగర్‌లో ఇలియాజ్‌ను బలవంతంగా తీసుకెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దుండగుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే పోలీసులు గాలిస్తున్న విషయం తెలుసుకున్న కిడ్నాపర్లు.. ఇలియాజ్‌ను వదిలేశారు. ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించి.. ఇలియాజ్‌ను విడిచిపెట్టి పారిపోయారు.
ఇక దుండగుల నుంచి తప్పించుకున్న ఇలియాజ్ పోలీస్ స్టేషన్ చేరుకుని జరిగిన విషయాన్ని వారికి వివరించాడు. ఎలా కిడ్నాప్ చేశారనే వివారాలు వెల్లడించారు. బిలాల్ అనే వ్యక్తికి చెందిన గ్యాంగ్ తనను కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేశారు. ఇలియాజ్ తెలిపిన వివరాల ప్రకారం, సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.