ఎన్డీయేలోకి టీడీపీ చేరికపై ఓ క్లారిటీ వచ్చింది. శనివారం కేంద్ర మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి చర్చలు జరిపారు. అమిత్ షాతో గంటపాటు జరిగిన భేటీలో ఎన్డీయేలోకి తెలుగుదేశం పార్టీ తిరిగి చేరటం సహా.. పొత్తులో బీజేపీకి ఇచ్చే సీట్లు విషయమై మూడు పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని టీడీపీ, జనసేన, బీజేపీ నిర్ణయించాయి. అలాగే సీట్ల కేటాయింపుపై మూడు పార్టీల మధ్య అవగాహన కుదిరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఢిల్లీలో జరిగే ఎన్డీయే భేటీకి టీడీపీ సైతం హాజరుకానున్నట్లు తెలిసింది.
అయితే అమిత్ షా నివాసంలో జరిగిన భేటీ తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. కానీ.. సీట్ల సర్దుబాటు మీద మూడుుపార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. దీని ప్రకారం జనసేన, బీజేపీకి కలిపి.. 30 అసెంబ్లీ, 8 ఎంపీ సీట్లను ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్లు సమాచారం. జనసేన 24 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లలో పోటీ చేయనుంది. అలాగే బీజేపీ 6 ఎంపీ, 6 ఎమ్మెల్యే స్థానాల్లో పోటీచేయనున్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లు కేటాయించగా.. బీజేపీని కలుపుకుని వెళ్లేందుకు జనసేన ఒక ఎంపీ సీటును త్యాగం చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ 17 ఎంపీ, 145 ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయి.
ఎంపీ సీట్లకు సంబంధించి కాకినాడ, మచిలీపట్నం స్థానాలలో జనసేన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి . మచిలీపట్నంలో బాలశౌరి పోటీ చేయడం పక్కా. ఆశ్చర్యకరంగా కాకినాడ ఎంపీగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే ఛాన్సుంది. పవన్ కళ్యాణ్‌ను ఎంపీగా పోటీచేయమని బీజేపీ అధిష్టానం సూచించినట్లు సమాచారం. రాజమండ్రి. నర్సాపురం. తిరుపతి. హిందూపురం. రాజంపేట, అరకు స్థానాలలో బీజేపీ పోటీ చేస్తుందనే ప్రచారం నడుస్తోంది. అయితే పార్టీల తరుఫున సంయుక్త ప్రకటన విడుదల అయ్యే దాకా లేదా ఎన్డీయే భేటీ జరిగే వరకూ ఈ విషయంలో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
మరోవైపు పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం గత కొన్నిరోజులుగా నడుస్తోంది. ఎమ్మెల్యే, ఎంపీగా రెండుచోట్లా పోటీ చేస్తారనే వార్తలూ వచ్చాయి. అయితే బీజేపీ పెద్దల సూచనతో పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి ఎంపీగా పోటీచేయడం ఖాయమని తెలుస్తోంది. అలాగే మంత్రివర్గంలోకి కూడా తీసుకుంటారనే వార్తలు వస్తున్నాయి.