ఏపీ పాలిటిక్స్ శనివారం ఓ క్లారిటీకి వచ్చేశాయి. వచ్చే ఎన్నికల్లో యుద్ధం ఎవరెవరి మధ్య జరుగబోతోందనే దానిపై సగటు ఓటర్‌కు ఓ స్పష్టత వచ్చేసింది. టీడీపీ ఎన్డీఏ కూటమిలోకి చేరటంతో.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఓ వైపు.. వైసీపీ మరోవైపు మోహరించనున్నాయి. అయితే పొత్తులపై ఇన్నిరోజులుగా కొనసాగుతూ వచ్చిన సస్పెన్స్ ఈరోజుతో వీడిపోయింది. దీంతో టీడీపీపై విమర్శలు స్టార్ట్ చేసింది వైసీపీ. సింగిల్‌గా తమను ఎదుర్కొనే ధైర్యం లేకే కూటమిగా వస్తోందని విమర్శించింది. మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్‌నాథ్ టీడీపీ, బీజేపీ పొత్తుల మీద విమర్శలు గుప్పించారు.
టీడీపీ తిరిగి ఎన్డీఏ కూటమిలోకి చేరటంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. టీడీపీ, జనసేన, బీజేపిది అనైతికమైన పొత్తు అని అంబటి రాంబాబు విమర్శించారు. తిరుపతి వచ్చిన అమిత్ షా మీద రాళ్లు వేయించిన చరిత్ర చంద్రబాబుదన్న అంబటి రాంబాబు.. ప్రత్యేక హోదా కాకుండా ప్యాకేజీ పేరిట పాచిపోయిన లడ్డూ ఇచ్చారంటూ పవన్ కేంద్రాన్ని విమర్శించిన సంగతిని గుర్తుచేశారు. ఇప్పుడు అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారంటూ విమర్శించారు. పొత్తు ప్రకటన తర్వాత శనివారం మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు.. ఎవరెన్ని పొత్తులు చేసినా, ఎన్ని ఎత్తులు వేసినా వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
"ముఖ్యమంత్రిగా జగన్ ఉండాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. ఎంతమంది వచ్చినా గెలుపు వైఎస్‌ఆర్‌సీపీదే. ఢిల్లీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అమిత్ షా కాళ్లమీద పడ్డారు. వాళ్లు అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే రకం" అంటూ అంబటి రాంబాబు విమర్శించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీచేస్తారని తనకు ముందే తెలుసన్నారు అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయితే తనకు ఇబ్బంది వస్తుందనే భయంతోనే చంద్రబాబు కుట్రలు చేశారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్‌కు రాజకీయాలు రావన్న అంబటి రాంబాబు.. చంద్రబాబు వెంట వెళ్తే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లేనని అన్నారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీచేస్తారని, కేంద్ర మంత్రిగా చేరతారనే వార్తల మధ్య అంబటి రాంబాబు సెటైరికల్ పోస్ట్ వదిలారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు ఆయన్ని ఎప్పుడూ సీఎం, సీఎం అని పిలుస్తుంటారు. ఈ వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు అంబటి రాంబాబు. సీఎం అంటే చీఫ్ మినిస్టరా.. లేదా సీఎం అంటే సెంట్రల్ మినిస్టరా అంటూ అంబటి రాంబాబు ఎగతాళి చేశారు. అలాగే సీఎం అంటే చంద్రబాబు మనిషా లేదా చీటింగ్ మనిషా అంటూ ట్వీట్ వదిలారు. మరోవైపు సీఎం జగన్‌ను ఎదుర్కొనే ధైర్యం లేక టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని మరో మంత్రి అమర్‌నాథ్ విమర్శించారు. చంద్రబాబుకు పొత్తులు కొత్తేమీ కాదన్న అమర్ నాథ్.. కేఏ పాల్‌తో తప్ప అన్ని పార్టీలతోనూ చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.