ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు పొడిచింది. వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. గత నెలరోజుల నుంచి జరుగుతున్న సంప్రదింపుల తర్వాత ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ తిరిగి చేరింది. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తొలుత తెలియజేశారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చంద్రబాబు, టీడీపీలను ఎన్డీఏలోకి ఆహ్వానిస్తూ ట్వీట్ చేశారు ఎన్డీఏ కుటుంబంలోకి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లను ఆహ్వానిస్తున్నాం. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి దేశ, రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాయని జేపీ నడ్డా ట్వీట్ చేశారు. అలాగే సీట్ల కేటాయింపులపైనా త్వరలో తెలియజేస్తామని చెప్పారు.
జేపీ నడ్డా ట్వీట్‌తో అధికారికంగా అన్ని పార్టీలు పొత్తును ప్రకటించేశాయి. సీట్ల లెక్కలపైనా ఓ క్లారిటీ రాగా.. ఇంకా ఆ వివరాలు వెల్లడించలేదు. మరోవైపు శనివారం ఉదయం కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచే పార్టీ ముఖ్య నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలోనే బీజేపీతో పొత్తుపై నేతలకు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్రం నుంచి సహకారం అవసరమన్న చంద్రబాబు.. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే పొత్తు పెట్టుకున్నట్లు వివరించారు. సీట్ల సర్దుబాటు మీద క్లారిటీ వచ్చిందన్న చంద్రబాబు.. పొత్తులో భాగంగా సీట్లు రాని నేతలు అసంతృప్తికి గురికావద్దని సూచించారు. మరో మీటింగ్ తర్వాత ఏయే స్థానాల్లో ఎవరు పోటీచేస్తారనే దానిపై స్పష్టత వస్తుందని చెప్పారు.
మరోవైపు ఆరేళ్ల తర్వాత టీడీపీ తిరిగి ఎన్డీఏ కూటమిలోకి చేరిన నేపథ్యంలో ప్రధాని మోదీని ఏపీకి తీసుకురావాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. మార్చి 17న చిలకూరిపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఉమ్మడి బహిరంగసభ నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని అధినేత చంద్రబాబు స్వయంగా పార్టీ నేతలకు తెలియజేశారు. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారని, ఏర్పాట్లు చేయాల్సిందిగా స్థానిక నేతలకు చంద్రబాబు సూచించినట్లు తెలిసింది. షెడ్యూల్ కారణంగా కుదరకపోతే మార్చి 18న సభను నిర్వహించేందుకు టీడీపీ శ్రేణులు రెడీ అవుతున్నాయి.
చంద్రబాబు ఆదేశాలతో గుంటూరు జిల్లా టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. బొప్పూడి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి గుడి సమీపంలో బహిరంగ సభకు స్థలాన్ని పరిశీలించారు. ఈ సభలోనే ఉమ్మడి మ్యానిఫెస్టోను ప్రకటిస్తారని తెలుస్తోంది. ప్రధాని మోదీ సైతం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సభను విజయవంతం చేయాలని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు భావిస్తున్నాయి.